Reading Time: 2 minutes

వేసవిలో ACలు వాడుతున్నారా? ఈ టిప్స్ ఫాలో అయితే కరెంట్ బిల్లు ఎక్కువ రాదు తెలుసా?

Caption of Image.

వేసవి కాలం రానే వచ్చింది. పిల్లలకు స్కూల్ సెలవులు కూడా దగ్గరపడుతున్నాయి. సూర్యుడు తన ప్రతాపంతో సెగలు పుట్టిస్తున్నాడు. ఈ ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి ఇంట్లో ఏసీలు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. ఏసీ ఇచ్చే చల్లదనం ఎంత హాయిగా ఉన్నా.. నెల చివరలో వచ్చే కరెంట్ బిల్లు మాత్రం చెమటలు పట్టిస్తుంది మధ్యతరగతి కుటుంబాలకు. మీరు ఏసీ బిల్లును తగ్గించుకుంటూనే.. చల్లని అనుభూతిని పొందడానికి కొన్ని స్మార్ట్ చిట్కాలు ఇప్పుడు తెలుసుకోండి. 

1. కిటికీలకు తెరలు..
ఎండ నేరుగా గదిలోకి పడితే ఏసీపై లోడ్ పెరుగుతుంది. అందుకే పగటిపూట కిటికీలకు మందపాటి తెరలు లేదా బ్లైండ్స్ వేయండి. ఇవి సూర్యరశ్మిని అడ్డుకుని గది వేడెక్కకుండా చూస్తాయి. దీనివల్ల ఏసీ కంప్రెసర్ తక్కువ సమయం పనిచేసి కరెంట్ ఆదా అవుతుంది.

2. ఎలక్ట్రానిక్ వస్తువులను ఆపివేయండి..
ఇంట్లో టీవీ, ఓవెన్, ఫ్రిజ్ వంటి వస్తువులు కేవలం విద్యుత్తును వాడటమే కాకుండా వేడిని కూడా విడుదల చేస్తాయి. అందువల్ల ఏసీలు వాడకంలో ఉన్నప్పుడు.. అవసరం లేని వాటిని స్విచ్ ఆఫ్ చేయడం వల్ల గది ఉష్ణోగ్రత పెరగకుండా ఉంటుంది. తద్వారా గదిని చల్లబరచడానికి ఏసీకి తక్కువ కరెంట్ సరిపోతుంది.

3. సరైన స్థానంలో ఇన్‌స్టాలేషన్..
ఏసీని గది పరిమాణానికి తగ్గట్టుగా సరైన టన్నేజ్ ఎంచుకోవడం ఎంత ముఖ్యమో.. దాన్ని ఎక్కడ అమర్చుతున్నామనేది కూడా అంతే ముఖ్యం. ఏసీ అవుట్‌డోర్ యూనిట్ నేరుగా ఎండ తగిలే చోట ఉండకూడదు. నీడ ఉన్న ప్రదేశంలో, గాలి ధారాళంగా ఆడే చోట అమర్చితే అది వేడిని త్వరగా బయటకు పంపి తక్కువ విద్యుత్ వాటకంతోనే బెస్ట్ కూలింగ్ అందిస్తుంది.

4. ఏసీ టెంపరేచర్ సెట్టింగ్స్..
చాలామంది ఏసీ వేయగానే గది త్వరగా చల్లబడాలని 18 డిగ్రీల వద్ద టెంపరేచర్ పెడతారు. కానీ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రకారం.. 24 డిగ్రీలు అనేది అత్యంత అనువైన ఉష్ణోగ్రత. మన శరీర ఉష్ణోగ్రత 36-37°C ఉంటుంది. కాబట్టి 24°C వద్ద కూడా చాలా చల్లగా అనిపిస్తుంది. ఏసీలో ప్రతి డిగ్రీ పెంచడం వల్ల సుమారు 6% విద్యుత్ ఆదా అవుతుందని గుర్తుంచుకోండి.

5. మొక్కల పెంపకం..
ఏసీలు ఉన్న వారు తమ ఇంటి చుట్టూ వ్యూహాత్మకంగా చెట్లను పెంచడం వల్ల అవి సహజ సిద్ధమైన నీడను ఇస్తాయి. వేసవిలో ఆకులు ఉండి, శీతాకాలంలో రాలిపోయే చెట్లను పెంచితే.. ఎండాకాలంలో ఎండను అడ్డుకుని ఇంటిని చల్లగా ఉంచుతాయి. దీంతో ఇంటి చుట్టుపక్కల వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఏసీ బిల్లులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

6. ఫిల్టర్ల క్లీనింగ్ అండ్ సర్వీసింగ్..
ఏసీ ఫిల్టర్లలో దూళి పేరుకుపోతే గాలి రాకను అడ్డుకుని, కంప్రెసర్‌పై భారం పెంచుతుంది. అందుకే క్రమం తప్పకుండా ఫిల్టర్లను శుభ్రం చేయాలి. అలాగే ఏసీ కాయిల్స్ కూడా క్లీన్ చేయించాలి. సీజన్ ప్రారంభానికి ముందు.. ముగిసిన తర్వాత సర్వీసింగ్ చేయించడం వల్ల ఏసీ జీవితకాలం పెరగడమే కాక కరెంట్ బిల్లు కూడా తక్కువగా వస్తుంది.

©️ VIL Media Pvt Ltd.