
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలపై తర్జనభర్జన కొనసాగుతోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం సోమవారం (ఏప్రిల్ 21) ఇరుదేశాల మధ్య రెండో దశ చర్చలు జరగాల్సి ఉంది. అయితే, అమెరికా తీరుకు నిరసనగా శాంతి చర్చలకు రాలేమని ఇరాన్ తేల్చిచెప్పింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్‌పై బాంబు వర్షం కురిపిస్తామని హెచ్చరించారు.
‘‘ఇరాన్‌తో కుదిరిన రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఎటువంటి పురోగతి లేకుండా ముగిస్తే ఇక బాంబులు పేలడం మొదలవుతుంది’’ అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. రెండో దశ చర్చలకు మేం ఒప్పుకున్నాం.. వాళ్లు కూడా రావాలి. ఒకవేళ వాళ్లు రాకపోయిన పర్వాలేదని అన్నారు. ఒప్పందం కుదరకపోతే సైనిక ఉద్రిక్తతతో సహా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. కాల్పుల విరమణను పొడిగించడం అత్యంత అసంభవమని పేర్కొన్నారు.
కొత్త అస్త్రాలతో సిద్ధంగా ఉన్నాం: ఇరాన్
ట్రంప్ బెదిరింపులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్‌ను లొంగదీసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలిబాఫ్ విమర్శించారు. బెదిరింపులతో కూడిన చర్చలను ఇరాన్ ఎన్నటికీ అంగీకరించదని, అవసరమైతే కొత్త వ్యూహాలతో ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నామని ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
ఇదిలా ఉండగానే, అమెరికాతో రెండ దఫా చర్చలకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 2026, ఏప్రిల్ 22తో అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుండటంతో నెక్ట్స్ ఏం జరగబోతుందని ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ నెలకొంది. అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదురుతుందా లేక మళ్లీ యుద్ధం మొదలవుతుందో చూడాలీ.