Reading Time: 2 minutes

అమెరికాతో చర్చలకు ఖమేనీ గ్రీన్ సిగ్నల్.. పాక్ బయల్దేరుతున్న జేడీ వాన్స్

Caption of Image.

హార్ముజ్ జలసంధిలో దిగ్భందం కారణంగా ఇరాన్, అమెరికా మధ్య రెండో రౌండ్ చర్చలు ముందుకు వెళ్లటంపై నీలి మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. కాల్పుల విరమణకు అమెరికా తూట్లు పొడుస్తోందంటూ సీరియస్ గా ఇరాన్ ఉన్న వేళ ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. ఏప్రిల్ 22తో కాల్పుల విరమణకు గడువు ముగుస్తున్న వేళ రెండు దేశాల మధ్య చర్చలకు రంగం సిద్ధం అవుతోంది. 

ఇరాన్ టాప్ లీడర్ ముజ్తాబా ఖమేనీ తన చర్చల బృందానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. అమెరికాతో హై-స్టేక్స్ చర్చలకు ఇస్లామాబాద్ వేదిక కానుంది. యుద్ధానికి ముగింపు పలికే దిశగా సాగుతున్న ఈ చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్వయంగా మంగళవారం ఉదయం పాకిస్థాన్‌కు బయలుదేరటం కన్ఫామ్ అయ్యింది. ఆయన వెంట స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్, సలహాదారు జారెడ్ కుష్నర్ వంటి హేమాహేమీలు వెళ్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా అందరి చూపు ఈ మీటింగ్ పైనే ఉంది.

ఈ ప్రయాణం అంత సులభంగా ఏమీ సాధ్యపడలేదు. అమెరికా విధిస్తున్న దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు చర్చలకు వెళ్లకూడదని ఇరాన్ రివల్యూషినరీ గార్డ్స్ భీష్మించుకోవడంతో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ వంటి దేశాల మధ్యవర్తిత్వం చివరికి ఫలించి.. ఇరాన్ తన పంతాన్ని వీడి చర్చలకు మొగ్గు చూపింది. ట్రంప్ ప్రభుత్వం నుండి డెడ్‌లైన్లు దగ్గర పడుతున్న వేళ.. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం యుద్ధ మేఘాలను తొలగిస్తుందా లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందించారు. సంధి గడువు ముగుస్తున్నా, డీల్ కుదుర్చుకోవాలని తనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేస్తూనే.. చర్చల్లో పురోగతి ఉంటే డెడ్‌లైన్ విషయంలో కొంత వెసులుబాటు కల్పిస్తామని హింట్ ఇచ్చారు. ఇది ఇరాన్‌కు ఒక రకమైన హెచ్చరికతో పాటు అవకాశం కూడా. గతంలో ఇస్లామాబాద్‌లోనే జరిగిన చర్చలు విఫలం కావడంతో.. ఈసారి జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం ఏ మేరకు ఫలితాన్ని సాధిస్తుందో చూడాలి.

ఈ చర్చల ప్రధాన అజెండా యుద్ధాన్ని ఆపడం, స్థిరమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం. ఇరు దేశాల మధ్య ఉన్న దశాబ్దాల వైరం, పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఇంత తక్కువ సమయంలో పూర్తి స్థాయిలో డీల్ జరగటం కుదరడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చర్చలకు సై అనడం, వైట్ హౌస్ దూకుడుగా స్పందించడం చూస్తుంటే, పశ్చిమ ఆసియా రాజకీయాల్లో ఒక కొత్త మలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ భేటీ ప్రపంచ శాంతికి బాటలు వేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

©️ VIL Media Pvt Ltd.