
గోదావరిఖని, వెలుగు: రాబోయే ఖరీఫ్ సీజన్‌కు తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ సూచించారు. సోమవారం రామగుండంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్‌లో యూరియా ఉత్పత్తి, సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు యూరియా ప్రధాన సరఫరాదారుగా ఉన్న ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్ నుంచి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా యూరియా సప్లై చేసేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
రైతులకు సమయానికి ఎరువులు అందడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్ పూర్తి కెపాసిటీతో పని చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తి, నిల్వలు, సరఫరాలో సమన్వయం పాటించాలన్నారు. రైతుల ప్రయోజనాల కోసం అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ఎరువుల సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం ఇతర అధికారులతో కలిసి ప్లాంట్‌ను సందర్శించి యూరియా ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఉత్పత్తి సామర్థ్యం, యంత్రాల పనితీరు, నిల్వలు వంటి అంశాలపై ఆరా తీశారు. ప్లాంట్ యూనిట్ హెడ్ జిందాల్, ప్రొడక్షన్ హెడ్, టెక్నికల్ సర్వీసెస్ హెడ్ డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.