
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నగరంలో వారసంతతో పాటు డైలీ మార్కెట్, కబేళా, షాపింగ్ కాంప్లెక్స్‌కు సంబంధించి టెండర్లు ఫైనల్ అయ్యాయి. మేయర్ ఆధ్వర్యంలో కమిషనర్సుజాత వేలంపాట ద్వారా టెండర్లను ఫైనల్ చేశారు. వారసంతను రూ. 37లక్షలకు ఎం. మోహన్ రావు, డైలీ మార్కెట్ రూ. 47.05లక్షలకు దక్కించుకున్నారు. రూ. 1,01,500కు కబేళాను ఖాదిర్ పాషా దక్కించుకున్నారు. కార్పొరేషన్ పరిధిలోని సుజాతనగర్ ప్రాంతంలో గల నాలుగు షాపులకు కార్పొరేషన్ సూచించిన దానికన్నా అతి తక్కువగా ధర రావడంతో ఆ టెండర్లను క్యాన్సల్ చేస్తున్నట్టు కమిషనర్ సుజాత పేర్కొన్నారు.
గతంలో టెండర్లు దక్కించుకొని కార్పొరేషన్‌కు డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆ కాంట్రాక్టర్ల వద్ద నుంచి డబ్బులు రికవరీ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. టెండర్ల, వేలం పాట టైంలో వేదికపై కమిషనర్ పక్కనే మేయర్ గణేష్ కూర్చోవడం నిబంధనలకు విరుద్ధమంటూ పలువురు పేర్కొనడం చర్చానీయాంశంగా మారింది. మేయర్ వేదికపై ఉండడం కాంట్రాక్టర్లను ప్రభావితం చేయడమేనని పలువురు విమర్శించారు. టెండర్లు, వేలం పాట నిర్వహిస్తున్న క్రమంలో కొందరు కాంట్రాక్టర్లు తరచూ బయటకు వెళ్లి వస్తుండడం, కార్పోరేటర్లు వేలం టైంలో అక్కడే ఉండడం పట్ల ఆఫీసర్ల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.