
- ఖమ్మంలో మొదలైన పనులు…త్వరలో భద్రాద్రికొత్తగూడెంలో
- పైప్ లైన్ పనులపై ఆఫీసర్లతో చర్చిస్తున్న మెగా డిస్ట్రిబ్యూటరీ సంస్థ
- మొదటి దశలో ఖమ్మం, కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్లలో
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. దాదాపు రూ.160 కోట్ల నిధులతో పైప్‌లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేసే పనులను మెగా డిస్ట్రిబ్యూటరీ సంస్థ చేపట్టింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ పైప్‌లైన్లు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఖమ్మం నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్ పనులు త్వరలో మొదలుకానున్నాయి. గ్యాస్ పైప్‌లైన్ పనులకు ఎలాంటి అవరోధాలు లేకుండా అన్ని శాఖలు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.
యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకోవడానికి ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమర్షియల్ గ్యాస్ లభ్యం కాకపోవడంతో అనేక వ్యాపారాలు మూతపడిన సందర్భాలు కూడా నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరతను అధిగమించేందుకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) సరఫరాను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీని భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంటింటికి గ్యాస్ సరఫరా స్కీమ్‌ను ప్రభుత్వం చేపట్టింది. డొమెస్టిక్‌తో పాటు కమర్షియల్ కనెక్షన్లు కూడా అందించాలని అడుగులు వేస్తోంది.
వేగంగా పనులు
జిల్లాలోని నగరాలు, పట్టణాల్లో పైప్‌లైన్ పనులు మెగా డిస్ట్రిబ్యూటరీ సంస్థ మొదలుపెట్టింది. కోదాడ పాయింట్ నుంచి ఖమ్మం వరకు పైప్‌లైన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మెయిన్, డిస్ట్రిబ్యూటరీ పైప్‌లైన్లు , కనెక్షన్ల పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 32 కిలోమీటర్ల పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయి.
మొత్తం 300 కిలోమీటర్ల పైప్‌లైన్ వేసి సుమారు 1.50 లక్షల కనెక్షన్లు అందించాలని లక్ష్యం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి దశలో కొత్తగూడెం, పాల్వంచల మీదుగా సారపాక ఐటీసీ వరకు గ్యాస్ పైప్‌లైన్ వేయనున్నారు. చంద్రుగొండ, అన్నపురెడ్డి మండలాల మీదుగా కొత్తగూడెం-పాల్వంచ మెయిన్ రోడ్డు పక్కన సారపాక ఐటీసీ వరకు పనులు వేగవంతం చేయనున్నారు.
చంద్రుగొండ మండలం జానకీపురం వద్ద టాప్ పాయింట్ ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం నుంచి పైప్‌లైన్ తీసుకోవాలా లేదా రాజమండ్రి నుంచి తీసుకోవాలా అనే అంశంపై మెగా డిస్ట్రిబ్యూటరీ సంస్థ సర్వే చేస్తోంది. ఆర్థికంగా ఏ రూట్ సౌకర్యవంతంగా ఉంటుందో నిర్ణయించనుంది. డిసెంబర్ నుంచి గ్యాస్ కనెక్షన్లు అందించాలని మెగా సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
రెండు నెలల్లో పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మొదటి దశలో జిల్లాలో 100 కిలోమీటర్లకు పైగా పైప్‌లైన్, 40 వేలకు పైగా కనెక్షన్లు ఇవ్వాలని ప్రణాళిక ఉంది. పైప్‌లైన్ ద్వారా 24 గంటలు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా అందుతుందని, గ్యాస్ సిలిండర్ల బుకింగ్ టెన్షన్ తొలగిపోతుందని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ తెలిపారు.