
హైదరాబాద్, వెలుగు: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతికతపై పట్టు సాధించాలని, అప్పుడే ఈ పోటీ ప్రపంచంలో రాణించగలరని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనే తుఫాను ముంచుకొస్తోందని, దాన్ని ఎదుర్కోవాలంటే విద్యార్థులు ఇప్పుడే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
సోమవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో డీపీఎస్, పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అధ్యక్షతన నిర్వహించిన సీబీఎస్‌ఈ టాపర్స్ ఫెసిలిటేషన్ సెర్మనీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. విద్యార్థులు తమ విలువైన కాలాన్ని సోషల్ మీడియాలో వృథా చేయొద్దని సూచించారు. సోషల్ మీడియాను పక్కనబెట్టి, భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి పెట్టాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారని స్పష్టం చేశారు.
ప్రతి విద్యార్థి ఏఐ వేగాన్ని అందుకునేలా ప్రయత్నాలు మొదలు పెట్టాలని, ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూ అప్‌డేట్ కావాలని సూచించారు. మల్క కొమరయ్య మార్గదర్శకత్వంలో డీపీఎస్ ఒక బ్రాండ్‌లా ఎదిగిందని ఆయన ప్రశంసించారు. పెద్దగా ఆలోచించడం, కష్టపడి పని చేయడం, లక్ష్యంపైనే ఫోకస్ పెట్టడం.. ఈ మూడు సూత్రాలే జీవితాన్ని మారుస్తాయని ఆయా స్కూళ్ల చైర్మన్, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, సీఈఓ మల్క యశస్వీ అన్నారు. అనంతరం మల్క యశస్వి, సుశీల్‌తో కలిసి లక్ష్మీనారాయణ విద్యార్థులకు మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.