Reading Time: 2 minutes

జేఈఈ మెయిన్‌‌‌‌లో తెలుగోళ్ల హవా..26 మంది టాపర్లలో పదిమంది మనోళ్లే

Caption of Image.
  • 100 పర్సంటైల్‌‌‌‌తో అదరగొట్టిన మనోళ్లు
  • తెలంగాణ నుంచి ఐదుగురు.. ఏపీ నుంచి మరో ఐదుగురు టాపర్లు
  • దేశవ్యాప్తంగా 26 మంది వంద పర్సంటైల్‌‌‌‌ సాధించగా, అందులో పది మంది తెలుగువారే 
  • జేఈఈ అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌కు 2.50 లక్షల మంది ఎంపిక

హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్ సెషన్‌‌–2 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు హవా కొనసాగించారు. ఏకంగా పది మంది విద్యార్థులు 300 మార్కులకు గాను 300 మార్కులు సాధించి.. 100 పర్సంటైల్ సాధించారు. సోమవారం జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌‌టీఏ) రిలీజ్ చేసింది. ఈ ఫలితాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 26 మంది విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించగా, అందులో తెలుగు విద్యార్థులే పది మంది ఉన్నారు.

 వీరిలో తెలంగాణ నుంచి మంత శివ కామేశ్, దొరనాల భవితేష్ రెడ్డి, సాయి రిత్విక్ రెడ్డి వెంకటరెడ్డి వల్ల, వివన్ శరద్ మహేశ్వరి, రిషి ప్రేమ్ నాథ్ వంద పర్సంటైల్ సాధించగా, ఆంధ్రప్రదేశ్ నుంచి జొన్నల రోషన్ మణదీప్ రెడ్డి, నరేంద్రబాబు గారి మహిత, తుంగ దుర్గ సుప్రభాత్, పాసల మోహిత్, బిజ్జం వెంకట చంద్రశేఖర్ రెడ్డి ఆ ఘనత సాధించారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్ సెషన్-1, సెషన్-2 కలిపి మొత్తం 16,04,854 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. అందులో 15,38,468 (95.8%) మంది పరీక్షకు హాజరయ్యారు. 

కాగా, జనవరిలో జరిగిన సెషన్1 పరీక్షకు 13,04,653 మంది అటెండ్ కాగా, ఏప్రిల్‌‌లో జరిగిన సెషన్ 2 పరీక్షకు 10,34,330 మంది హాజరయ్యారు. మహిళా కేటగిరీలో తెలంగాణ టాపర్‌‌‌‌గా మల్లవరపు ఆస్న (99.9982287 పర్సంటైల్‌‌) నిలిచింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సాయి రిత్విక్ రెడ్డి వెంకటరెడ్డి వల్ల 100 పర్సంటైల్‌‌తో నంబర్ వన్ ర్యాంకర్‌‌‌‌గా నిలిచారు. దివ్యాంగుల కేటగిరీలో నానాల నాగ చైతన్య (99.7812780 పర్సంటైల్‌‌) జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచారు. ఎస్టీ కేటగిరీలో మొకళ్ల శరత్ చంద్ర (99.9763781) తెలంగాణ టాపర్​గా నిలిచారు. 

అడ్వాన్స్‌‌డ్‌‌కు 2.5 లక్షల మంది.. 

జేఈఈ మెయిన్ ఫలితాల ఆధారంగా దేశవ్యాప్తంగా 2,50,184 మందిని జేఈఈ అడ్వాన్స్‌‌డ్ రాసేందుకు అర్హత సాధించారు. ఈ ఏడాది కటాఫ్ పర్సంటైల్ వివరాలను ఎన్‌‌టీఏ వెల్లడించింది. జనరల్ కేటగిరీలో 93.4123549 పర్సంటైల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 82.4164528, ఓబీసీలో 80.9232, ఎస్సీ కేటగిరీలో 63.9172, ఎస్టీ కేటగిరీలో 52.0147 పర్సంటైల్‌‌ను కటాఫ్‌‌గా నిర్ణయించారు. వీరంతా ఐఐటీల్లో సీట్ల కోసం మే నెలలో నిర్వహించబోయే జేఈఈ అడ్వాన్స్‌‌డ్ పరీక్షలో పోటీ పడనున్నారు. కాగా, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ,ఎస్టీ ఇలా అన్ని కేటగిరిల్లో గతేడాదితో పోలిస్తే కటాఫ్ పెరిగింది. 

23 నుంచి అడ్వాన్స్‌‌డ్ అప్లికేషన్లు..

ఐఐటీల్లో అడ్మిషన్ల కోసం జేఈఈ అడ్వాన్స్‌‌డ్ 2026 మే 17న ఐఐటీ రూర్కీ నిర్వహించనున్నది. దీనికి ఈ నెల 23 నుంచి మే 2 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. రిజిస్ట్రర్‌‌‌‌ అయిన విద్యార్థులు మే 4 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం ఎంపిక చేసిన రెండున్నర లక్షల మందిలో పరీక్ష రాసిన వారిలో మెరిట్ ఆధారంగా సీట్ల సంఖ్యను బట్టి 45 వేల మంది నుంచి 50 వేల మందిని ఎంపిక చేస్తారు. వారందరికీ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర విద్యా సంస్థల్లో బీటెక్, బీఈ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు లభించనున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.