
- స్కూళ్లు, అంగన్‌వాడీల్లో వసతులపై ఫోకస్ పెట్టాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు అందే 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. 2023-–24, 2024-–-25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి విడుదలైన నిధులను ఏయే పనులకు ఖర్చు చేయాలన్న అంశంపై పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆర్థిక సంఘం నిధుల్లో ‘టైడ్ గ్రాంట్స్’ కింద వచ్చే మొత్తాన్ని రెండు విభాగాలకే కేటాయించాలని సర్కార్ స్పష్టం చేసింది.
50 శాతం నిధులు గ్రామంలో పారిశుధ్యం, ఇంటింటి చెత్త సేకరణ, మురుగునీటి నిర్వహణ, బహిరంగ మల విసర్జన రహితం గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు మాత్రమే వాడాలి. మిగతా 50 శాతం నిధులు తాగునీటి సరఫరా, వర్షపు నీటి సంరక్షణ, నీటి రీసైక్లింగ్ పనులకు కేటాయించాలి. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో పైపులైన్ల పొడిగింపు పనులకు కూడా ఈ నిధులను వినియోగించుకోవచ్చు.
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ‘అన్-టైడ్’ నిధులను వినియోగించాలని సూచించారు. సొంత భవనం లేని చోట పంచాయతీ భవనాల నిర్మించాలి. ప్రభుత్వ స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అదనపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలి. హెల్త్ సబ్-సెంటర్లలో రోగుల కోసం టాయిలెట్లు, కూరగాయలు, నాన్-వెజ్ అమ్మకాల కోసం ప్రత్యేకంగా విలేజ్ మార్కెట్లు నిర్మించాలి.
ఈ మార్కెట్ల వద్ద క్లీనింగ్ కోసం నీటి సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. పనులు చేయకుండానే తప్పుడు వివరాలతో లేదా నకిలీ బిల్లులతో నిధులు డ్రా చేస్తే సంబంధిత అధికారులపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రతి పైసా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక ప్రకారమే ఖర్చు చేయాలి. పనుల వివరాలను గ్రామ సభల్లో తెలుపాలని, కలెక్టర్లు ఈ నిధుల వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాల్లో పేర్కొంది.