
- రాష్ట్రవ్యాప్తంగా అకాలవర్షం..ఈదురుగాలులు
- వందల ఎకరాల్లో దెబ్బతిన్న వరి తడిసిముద్దయిన కల్లాల్లోని ధాన్యం
- రాలిపోయిన మామిడికాయలు మార్కెట్‌లో తడిసిన శనగలు
- హైదరాబాద్‌లోనూ దంచికొట్టిన వాన
- కుత్బుల్లాపూర్‌లో 4.48, కూకట్‌పల్లిలో 3.68 సెంటీ మీటర్ల వర్షపాతం
- రేపు, ఎల్లుండి ఎల్లో అలర్ట్
నెట్వర్క్/హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అకాల వర్షం కురిసింది. సాయంత్రంపూట ఉన్నట్టుండి ఒక్కసారిగా వాన పడింది. కొన్నిచోట్ల వడగండ్లు పడ్డాయి. దీంతో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వానకు తడిసి ముద్దయింది. చాలాచోట్ల మామిడి కాయలు నేలరాలాయి. కామారెడ్డి జిల్లా కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, భిక్కనూరు తదితర మండలాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. వర్షానికి చేతికొచ్చిన వరి పంట దెబ్బతింది. వడ్ల గింజలు రాలిపోయాయి. కామారెడ్డిలో కొత్త బస్టాండు, కాలేజీ గ్రౌండ్ సమీపంలో చెట్లు పడిపోయాయి. కొంత సేపు కరెంట్ సప్లయ్ నిలిచిపోయింది. చెట్లను తొలగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల, న్యావనంది, సిరికొండ, కొండూరు గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. సుమారు 450 ఎకరాల్లో వరి పంట నేలరాలింది. సగానికిపైగా గింజలు నేలరాలాయి. ఆరబోసిన ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. కల్లాల్లో ధాన్నాన్ని కాపాడుకోవడానికి రైతులు నానాతంటాలు పడ్డారు.
ఆదిలాబాద్‌లో దంచికొట్టిన వాన..
ఆదిలాబాద్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. నేరడిగొండలో శనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. గన్నీబ్యాగుల కొరత సాకుతో అధికారులు శనగలు కొనలేదు. దీంతో మార్కెట్ యార్డులో వేలాది క్వింటాళ్ల శనగలు పేరుకుపోయాయి. శనివారం రాత్రి ఈదురు గాలులతో వర్షం పడటంతో శనగ కుప్పలపై కప్పిన టార్పాలిన్ కవర్లు ఎగిరిపోయి శనగలు పూర్తిగా తడిసిపోయాయి. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి, కంది, మునిపల్లి, ఝరాసంఘం, జిన్నారం మండలాల్లో ఆకాల వర్షం కురిసింది. ఈదురుగాలులతో వడగండ్ల వాన పడింది. ఆదివారం సాయంత్రం ఝరాసంగం మండలం జీర్లపల్లి, బోరేగాంవ్, బొప్పన్‌పల్లి, జునేగాంవ్, చీలెమామిడి గ్రామాల్లో ఈదురుగాలులు వీయడంతో పలు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. జీర్లపల్లిలో సుమారు 20 ఇండ్లపై ఉన్న రేకులు ఎగిరిపోవడంతో ఆ కుటుంబాలు ఇబ్బందిపడ్డాయి. జీర్లపల్లి నుంచి చీలెమామిడికి వెళ్లే ప్రధాన రోడ్డుపై చింతచెట్టు రోడ్డుకు అడ్డంగా పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చేతికి వచ్చిన జొన్న, మక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మామిడి కాయలు నేలరాలాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో చేతికి వచ్చిన వరి ధాన్యం నేల రాలడంతోపాటు కల్లాలలో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మామిడి కాయలు సైతం నేల రాలడంతో అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని పోతుల బొగుడ, పాంబండ గ్రామాల్లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో కోతకు వచ్చిన వరి పంటకు, కూరగాయ పంటలకు నష్టం వాటిల్లింది.
సిరిసిల్లలో పిడుగు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం పడింది.ఆదివారం సాయంత్రం సిరిసిల్లలోని రాజీవ్ నగర్ శివారు ప్రాంతంలో తాటి చెట్టుపై పిడుగు పడటంతో మంటల్లో కాలిపోయింది. ఆ సమయంలో దగ్గర ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
నగరంలో భారీ వడగండ్ల వాన..
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం అకస్మాత్తుగా వర్షం దంచికొట్టింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఎండవేడిమి, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు ఈ వాన కొంత ఉపశమనం కలిగించింది. కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 4.48 సెంటీ మీటర్లు, కూకట్ పల్లిలో 3.68 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు గంటలోపే 3 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ వాన కురవడంతో రోడ్లపైకి నీరు చేరింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. కుత్బుల్లాపూర్, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, నిజాంపేట్, కొంపల్లి, గండిమైసమ్మ తదితర ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు వీచాయి. వడగండ్ల వాన కురిసింది. ఈదురు గాలులకు పద్మానగర్‌లో ఓ చెట్టు నేలకూలింది. కరెంట్‌స్తంభాలు విరిగి పడి టూవీలర్ధ్వంసమైంది. చింతల్‌లో వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులు, వర్షంతో చాలా ప్రాంతాల్లో సుమారు గంటపాటు కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం కావడంతో కొంతమేర ట్రాఫిక్ కష్టాలు తప్పాయి. మంగళవారం, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 6.45 నుంచి 11.5 సెంటీ మీటర్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. సోమవారం తేలికపాటి వర్షం కురుస్తుందని తెలిపింది.
నేలకొరిగిన 53 చెట్లు
కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, బాచుపల్లి, అల్వాల్, సుచిత్ర ప్రాంతాల్లో ఈదురుగాలులతో 53 చోట్ల చెట్లు కూలిపోయాయి. 8 చోట్ల రోడ్లపై వర్షం నీరు నిలిచింది. ఈ ఫిర్యాదులను హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు. రాత్రి 8.30 గంటల వరకు అన్నిచోట్ల చెట్లను క్లియర్‌చేశారు.
ప్రాంతం వర్షపాతం (సెంటీమీటర్లు)
కుత్బుల్లాపూర్ 4.48
కూకట్‌పల్లి 3.68
అల్వాల్ 2.35
బాలానగర్ 2.08
జీడిమెట్ల 1.45