Reading Time: 2 minutes

ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్: క్లెయిమ్ తర్వాత కవరేజ్ ఎలా మారుతుంది? మిగిలిన వారి పరిస్థితి ఏంటి ?

Caption of Image.

కుటుంబం మొత్తానికి కలిపి ఒకే పాలసీ తీసుకోవడాన్ని ‘ఫ్యామిలీ ఫ్లోటర్’ ప్లాన్ అంటారు. ఇందులో అందరికీ కలిపి ఒకే బీమా(insurance) మొత్తం (Sum Insured) ఉంటుంది. అయితే, ఒకే సంవత్సరంలో కుటుంబికుల్లో ఒకరికి పెద్ద ఆపరేషన్ లేదా జబ్బు చేసి భారీగా బిల్లు వస్తే, అది మిగిలిన వారి కవరేజీపై ఎలా ప్రభావం చూపిస్తుందో తెలుసా…. 

1. మిగిలిన వారికి కవరేజ్ తగ్గుతుందా
ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లో అందరూ ఒకే ‘లిమిట్’ను వాడుకుంటారు. ఉదాహరణకు, మీకు  10 లక్షల పాలసీ ఉందనుకుందాం.కుటుంబీకుల్లో ఒకరికి చికిత్స కోసం 8 లక్షలు ఖర్చయితే, ఆ సంవత్సరానికి మిగిలిన వారందరికీ కలిపి ఇంకా కేవలం 2 లక్షల కవరేజ్ మాత్రమే ఉంటుంది. అంటే, అదే ఏడాదిలో మరొకరికి అనారోగ్యం వస్తే మిగిలిన కవరేజ్ లేదా  ఆ 2 లక్షల  కవరేజ్ వర్తించకపోవచ్చు. 

2. పునరుద్ధరణ ప్రయోజనం
చాలా కంపెనీలు ఇప్పుడు ‘రిస్టోరేషన్’ అనే సదుపాయాన్ని ఇస్తున్నాయి. ఒకవేళ మీ బీమా మొత్తం ఖర్చయిపోతే, కంపెనీ మళ్లీ ఆ మొత్తాన్ని రీఛార్జ్ చేస్తుంది. కానీ ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్ని పాలసీలు మొత్తం డబ్బు అయిపోయిన తర్వాతే రీఛార్జ్ చేస్తాయి. కొన్ని ప్లాన్లలో ఒకే జబ్బుకు రెండోసారి ఈ రీఛార్జ్ డబ్బును వాడుకోవడానికి వీలుండదు. బీమా మొత్తం ఎప్పుడు పునరుద్ధరించబడుతుందో & దానిని మళ్లీ ఎప్పుడు ఉపయోగించవచ్చో తెలుసుకోవడం మంచిది.

3. బోనస్ కోల్పోయే అవకాశం
ఏడాది మొత్తంలో ఎవరూ కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోతే బీమా కంపెనీలు ‘నో క్లెయిమ్ బోనస్’ ఇస్తాయి. దీనివల్ల మీ కవరేజ్ పెరుగుతుంది. కానీ ఒక్క పెద్ద క్లెయిమ్ చేసినా, వచ్చే ఏడాది మీకు అందే ఈ బోనస్ తగ్గిపోతుంది లేదా అసలు లభించదు.

►ALSO READ | వారేవా అద్భుతం : రూ.3 కోట్ల వాచీ.. సంస్కృతంలో అంకెలు.. !

4. గమనించాల్సిన విషయాలు
*కొన్ని జబ్బులకు లేదా హాస్పిటల్ రూమ్ రెంట్‌కు పరిమితులు ఉంటాయి. మీ బిల్లు ఎంత ఉన్నా, పాలసీలో చెప్పిన దానికంటే ఎక్కువ కంపెనీ చెల్లించదు.
*కో-పేమెంట్ అంటే పాలసీలో కో-పేమెంట్ నిబంధన ఉంటే, బిల్లులో కొంత శాతం మీరే సొంతంగా కట్టాల్సి ఉంటుంది.

ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకునేటప్పుడు కేవలం తక్కువ ప్రీమియం మాత్రమే చూడకండి. మీ కుటుంబంలో ఎంత మంది ఉన్నారో దాని బట్టి సరిపడా లేదా సరైన బీమా మొత్తం ఉండేలా చూసుకోండి. ఒకవేళ క్లెయిమ్ జరిగితే మళ్లీ కవరేజ్ ఇచ్చే ‘రిస్టోరేషన్’ ఆప్షన్ ఉందో లేదో ముందే చెక్ చేసుకోవడం మంచిది.

©️ VIL Media Pvt Ltd.