
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు సెకండ్ ఇన్నింగ్ లో మరింత జోరు పెంచేసింది. మళ్లీ వెండితెరపై తన సత్తాను చాటేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ‘ ఓ బేబీ’ వంటి బ్లాక్ బస్టర్ హీట్ మూవీ తర్వాత సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్య.. అంటూ సాగే వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
జోష్ నింపుతున్న ‘తస్సాదియ్య’ సాంగ్!
తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై స్వయంగా నిర్మిస్తున్న ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్య’ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఈ పాటలోని “త త తస్సాదియ్యా.. తగ్గేదేలేదు హుయ్యా..” అనే లిరిక్స్ వినేవారిలో తెలియని ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తనదైన స్టైల్‌లో ఒక అదిరిపోయే ఫ్యామిలీ పార్టీ నెంబర్‌ను అందించారు. ఈ పాటను సమంత ప్రాణ స్నేహితురాలు, ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద, పుణ్య కలిసి ఎంతో హుషారుగా ఆలపించారు. వీడియోలో సమంత వేసిన గ్రేస్‌ఫుల్ స్టెప్పులు చూస్తుంటే, ఆమె మరోసారి తన డ్యాన్స్‌తో మ్యాజిక్ చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది.
క్రేజీ కాంబినేషన్ లో..
‘ఓ బేబీ’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత సమంత, దర్శకురాలు బి.వి. నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో సమంత ఒక సాధారణ ఇల్లాలుగా కనిపిస్తూనే, ఆపదలో ఉన్న తన కుటుంబాన్ని కాపాడుకునే పవర్‌ఫుల్ మహిళగా అద్భుతమైన నటనను కనబరచబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో సమంత పద్ధతైన చీరకట్టులో ఉంటూనే, శత్రువుల వేటలో పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం చూస్తుంటే ‘లేడీ సూపర్ స్టార్’ రేంజ్ పెర్ఫార్మెన్స్ గ్యారెంటీ అనిపిస్తోంది.
►ALSO READ | మిల్కీ బ్యూటీ తమన్నాకి భారీ షాక్..15 ఏళ్ల ‘సోప్ వార్’కు మద్రాస్ హైకోర్టు ఫుల్ స్టాప్!
నిర్మాతగా ఆమెకు ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. ఇక ఈ చిత్రానికి సమంత భర్త, ప్రముఖ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు (రాజ్ & డికె ద్వయం) కథను అందించారు. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం కానుంది. యాక్షన్, సస్పెన్స్, ఎమోషన్స్ సమపాళ్లలో ఉన్న ఈ కథ సమంత కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 15, 2026న విడుదల కానుంది.