
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ‘జైలర్-2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 2023లో వచ్చిన ‘జైలర్’ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లోని ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసుకొని రజనీ బుధవారం చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విమానాశ్రయం వద్ద విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇందులో ఆసక్తికరంగా విజయ్ నటించిన ‘జన నాయగన్’ ఆలస్యంపై ఓ ప్రశ్న తలెత్తింది. దీనికి రజనీ ‘సారీ.. నో కామెంట్స్’ అంటూ సమాధానాన్ని దాటవేశారు.
ఇక తాను, కమల్‌హాసన్ కలిసి నటించనున్న సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం అవుతుందని తెలిపారు. ‘జైలర్ 2’ షూటింగ్ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుందని.. నిర్మాణ సంస్థ త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తుందని చెప్పారు. ఇక, ‘జన నాయగన్’ విషయానికొస్తే.. నటుడు, టివికె పార్టీ అధినేత విజయ్ నటించిన చిత్రమిది. ఈ సినిమా నిజానికైతే.. ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సింది. కానీ, సెన్సార్ బోర్డు అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడింది. ఇంకా సినిమా కొత్త విడుదల తేదీలో స్పష్టత రాలేదు.