
ఏలూరు: ఎర్రటి గోదావరి పారడమే ఆలస్యం.. తీరం పొడవునా ఒకే ఒక మాట వినిపిస్తుంది. ‘పులస వచ్చింది రోయ్!’ అని.. ప్రకృతి ఇచ్చే అరుదైన కానుక కోసం ఏడాదంతా వెయ్యి కళ్లతో ఎదురుచూసే మత్స్యప్రియుల నిరీక్షణకు ఈ ఏడాది తెరపడింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరమ్మ ఉప్పొంగుతుండటంతో, ఆ వరద నీటితో పాటే అమృతతుల్యమైన పులస చేప మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సహా తీరప్రాంత మార్కెట్లలో ఇప్పుడు ఎక్కడ చూసినా పులస ముచ్చట్లే వినిపిస్తున్నాయి. సముద్ర గర్భంలో ‘హిల్సా’గా సంచరించే ఈ చేప, సంతానోత్పత్తి కోసం వరద రోజుల్లో ఉప్పునీటిని వదిలి గోదావరి మంచి నీటిలోకి ఎదురీదుతూ వస్తుంది. అలా మైళ్ల దూరం ప్రవాహాన్ని తట్టుకుని ఎదురీదే క్రమంలో దాని శరీరంలో జరిగే సహజసిద్ధమైన మార్పులే దానికి సాటిలేని, ప్రత్యేకమైన రుచిని తెచ్చిపెడతాయి. అందుకే.. ‘పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే’ అన్న నానుడి మాత్రమే కాదు.. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు అదొక సాంప్రదాయం, ఆత్మీయతకు ప్రతీక. ముఖ్యమైన వ్యక్తులకు, బంధువులకు పులస చేపను కానుకగా పంపడాన్ని ఇక్కడి ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు.
ఈ అరుదైన రుచికి గోదావరి జిల్లాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. డిమాండ్‌కు తగ్గట్టుగా లభ్యత లేకపోవడంతో పులస ‘పసిడి’ కంటే ప్రియంగా మారుతోంది. తీరంలో మత్స్యకారులు వేటను ముమ్మరం చేసినప్పటికీ, వలలో పడే చేపల సంఖ్య చాలా పరిమితంగానే ఉంటోంది. దీంతో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. చిన్న సైజు చేప కూడా వేలల్లో పలుకుతుండగా, కేజీకి పైబడి ఉండే పెద్ద సైజు పులసల ధర రూ.10,000 నుంచి ప్రారంభమై ఏకంగా లక్ష రూపాయల వరకూ పలుకుతుండటం గమనార్హం.
ధర ఎంతైతేనేం.. రుచే ముఖ్యమంటూ పులస ప్రియులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. ఎంతటి భారీ ధరకైనా వెనుకాడకుండా సొమ్ము చెల్లించి దక్కించుకుంటున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో కొందరు వ్యాపారులకు ముందుగానే ఫోన్ పే ద్వారా రూ.10,000 నుంచి రూ.20,000 వరకు అడ్వాన్సులు పంపి తమ ఆర్డర్లను ఖరారు చేసుకుంటున్నారు. గోదావరి జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలోని నలుమూలల నుంచి, ఇటు పక్క రాష్ట్రాల నుంచి కూడా పులస కోసం వ్యాపారులకు, తెలిసిన మత్స్యకారులకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సీజన్ మరో కొద్దివారాల పాటు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉండటంతో, లభించిన ఐదారు వారాల సమయాన్ని అస్సలు వదులుకోవద్దని మత్స్యప్రియులు ఆరాటపడుతున్నారు. ఒకవైపు ఎర్రటి గోదావరి వరద ఉధృతి పెరుగుతుంటే, మరోవైపు మార్కెట్లలో పులస విక్రయాల సందడి అంతే జోరుగా సాగుతోంది. గోదావరి తీరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పులస పరిమళాల పండగ వాతావరణమే కనిపిస్తోంది.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..