
Watch: టీమిండియా యంగ్ క్రికెటర్ రమణ్ దీప్ సింగ్ ఒక ఇంటివారయ్యారు. ప్రముఖ హిందీ బుల్లితెర నటి చార్లీ చౌహాన్‌ను ఆయన వివాహమాడారు. పంజాబ్ రంజీ జట్టుతో పాటు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున ఆడుతున్న రమణ్ దీప్ సింగ్, నటి చార్లీల వివాహం అత్యంత ప్రైవేట్ ప్రదేశంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వేడుకగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోకి రావడంతో అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రాజసం ఉట్టిపడేలా వరుడు-వధువు లుక్స్
వివాహ మహోత్సవంలో కొత్త జంట ఎంతో చూడముచ్చటగా కనిపించింది. చార్లీ చౌహాన్ సాంప్రదాయ ఎరుపు రంగు లెహంగాలో దేవకన్యలా మెరిసిపోగా, రమణ్ దీప్ సింగ్ సింగ్ గోల్డెన్ రంగు షేర్వానీలో రాజసంగా కనిపించారు. టీమిండియా స్టార్ వేగవంతమైన బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ బ్లాక్ సూట్, రెడ్ టర్బన్ ధరించి ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అర్ష్‌దీప్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ జంట ఫొటోను షేర్ చేస్తూ, వారి కొత్త జీవితానికి శుభాకాంక్షలు తెలియజేశారు. గత కొన్ని రోజులుగా చార్లీ ప్రీ-వేడ్డింగ్ వేడుకల వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎవరీ చార్లీ చౌహాన్?
చార్లీ చౌహాన్ హిందీ బుల్లితెర ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటి. కైసీ యే యారియాన్ సీరియల్‌లో ముక్తి వర్ధన్ పాత్ర ద్వారా, అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్లో ఇలా పాత్ర ద్వారా ఆమె విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంటీవీ ప్రాచుర్యం పొందిన రోడీస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఆమె నాచ్ బలియే డ్యాన్స్ షోలో కూడా పాల్గొన్నారు. అప్పట్లో ఆమె ప్రముఖ నటుడు కుంవర్ అమర్‌తో సుదీర్ఘకాలం డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. నటిగానే కాకుండా చార్లీ మంచి రైటర్, లిరిసిస్ట్‌గా కూడా రాణిస్తున్నారు. కాగా, రమణ్ దీప్ సింగ్ (28) , చార్లీ చౌహాన్ (35) ల మధ్య దాదాపు 7 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉంది.
Arshdeep Singh, Naman Dhir, Ashwini Kumar, Jassinder Singh and friends at Ramandeep Singh’s Wedding https://t.co/scGGtXDuPQ pic.twitter.com/vzA7EyIW0G
— Sawai96 (@Aspirant_9457) August 7, 2026
రమణ్ దీప్ సింగ్ క్రికెట్ కెరీర్ వివరాలు
రమణ్ దీప్ సింగ్ సింగ్ అంతర్జాతీయ స్థాయిలో నవంబర్ 2024లో సౌతాఫ్రికాపై టీ20 మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు భారత్ తరఫున 2 మ్యాచ్‌లు ఆడి 15 పరుగులు, 1 వికెట్ తీశారు. అయితే ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఆయన కీలకమైన ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్‌లో 39 మ్యాచ్‌లు ఆడిన రమణ్ దీప్ సింగ్ 299 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..