Reading Time: < 1 minute

ఫోర్జరీ సర్టిఫికెట్లతో అనుమతిపొందిన.. ప్రైవేటు కాలేజీలకు భారీ జరిమానా

Caption of Image.
  • ఒక్కో కాలేజీకి రూ.8 లక్షల ఫైన్ వేసిన ఇంటర్ బోర్డు 
  • హైడ్రా, జీహెచ్ఎంసీ రిపోర్టులతో దొరికిపోయిన బాగోతం

హైదరాబాద్, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి అఫిలియేషన్‌‌ పొందిన ప్రైవేటు జూనియర్‌‌ కాలేజీలపై ఇంటర్‌‌ బోర్డు చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు ఇప్పటివరకు తేలిన 45 ప్రైవేటు కాలేజీలకు ఒక్కోదానికి రూ.8 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఆయా కాలేజీలు సమర్పించిన ఫైర్‌‌ ఎన్‌‌వోసీలు, బిల్డింగ్‌‌ పర్మిషన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు సహా పలు కీలక పత్రాలను పరిశీలించగా.. వాటిలో కొన్ని నకిలీవని తేలినట్లు అధికారులు తెలిపారు. 

ముఖ్యంగా హైడ్రా, జీహెచ్‌‌ఎంసీ అధికారుల తనిఖీలు, నివేదికలతో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం బయటపడింది. ప్రభుత్వ ముద్రలు, అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి అఫిలియేషన్‌‌ పొందినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే పలు కాలేజీలపై హైడ్రా ఫోర్జరీ కేసులు నమోదు చేయగా.. తాజాగా ఇంటర్‌‌ బోర్డు జరిమానాలు విధించింది. 

ప్రస్తుతం 45 కాలేజీలపై చర్యలు తీసుకోగా, పత్రాల వెరిఫికేషన్‌‌ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని కాలేజీల అక్రమాలు బయటపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. విచారణ పూర్తయిన తర్వాత అఫిలియేషన్‌‌ రద్దు అంశాన్ని పరిశీలిస్తామని ఇంటర్‌‌ బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.