
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అక్కడి న్యాయస్థానం చురకలు వేసింది. ట్రంప్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వైట్‌హౌస్ బాల్‌రూమ్ ప్రాజెక్టు నిర్మాణంపై శుక్రవారం అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైట్‌హౌస్ లోని కూల్చివేసిన ‘ఈస్ట్ వింగ్’ స్థానంలో ఏకంగా 400 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,300 కోట్లకు పైగా) వ్యయంతో నిర్మిస్తున్న ఈ భారీ బాల్‌రూమ్ పనులను తక్షణమే నిలిపివేయాలని కోర్టు స్పష్టం చేసింది. వాషింగ్టన్‌లోని ‘యు.ఎస్. కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్’ 2-1 మెజారిటీ తీర్పునిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. “ప్రతి అధ్యక్షుడూ వైట్‌హౌస్‌కు తాత్కాలిక అద్దెదారు మాత్రమే తప్ప, యజమాని కాదు. యూఎస్ కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) ముందస్తు అనుమతి లేకుండా అందులో ఎలాంటి భారీ మార్పులు లేదా నిర్మాణాలు చేయడానికి వీల్లేదు” అని న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది.
కాంగ్రెస్ అనుమతి తీసుకోకుండా ఈస్ట్ వింగ్‌ను కూల్చివేసి, 90,000 చదరపు అడుగుల వైశాల్యంలో బాల్‌రూమ్ నిర్మించడాన్ని సవాలు చేస్తూ నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టారిక్ ప్రిజర్వేషన్ గతేడాది కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో గతంలో లభించిన తాత్కాలిక స్టేను అప్పీల్ కోర్టు సమర్థించింది. “ఇంతటి భారీ బాల్‌రూమ్ నిర్మించాలా వద్దా అనేది నిర్ణయించాల్సింది కాంగ్రెస్ మాత్రమే కానీ, ఎగ్జిక్యూటివ్ (కార్యనిర్వాహక వర్గం) సొంతంగా నిర్ణయం తీసుకోకూడదు” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే, ట్రంప్ పరిపాలనా యంత్రాంగం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా ఈ తీర్పు అమలుపై 14 రోజుల గడువు ఇచ్చింది.
కోర్టు తీర్పుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. భద్రతా కారణాల రీత్యా ఈ బాల్‌రూమ్ నిర్మాణం అత్యంత అవసరమని చెప్తూ వచ్చిన ఆయన, శుక్రవారం ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈ తీర్పును దారుణమైనదిగా, రాజకీయ ప్రేరేపితమైనదిగా అభివర్ణించిన ట్రంప్, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల వైట్‌హౌస్ అధికారులు, తాను దాడి ముప్పు పరిధిలోకి వచ్చినట్లైందని ఆందోళన వ్యక్తం చేశారు. “సుప్రీంకోర్టు ఈ అన్యాయమైన తీర్పును పూర్తిగా కొట్టివేయాలి” అని ట్రంప్ డిమాండ్ చేశారు. ఈ ప్రణాళికలో కేవలం బాల్‌రూమ్ మాత్రమే కాకుండా బాంబ్ షెల్టర్, అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు, డ్రోన్లు, క్షిపణుల నుంచి రక్షణ కల్పించే వ్యవస్థలతో కూడిన సంక్లిష్టమైన భద్రతా ఏర్పాట్లు ముడిపడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.