Reading Time: < 1 minute

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సు నదిలో పడిపోవడంతో 23 మంది మృతి చెందగా.. పలువురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో మరికొంత మంది గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 40 మంది ప్రయాణికులతో బస్సు, నైరుతి జిల్లా రాజ్‌బారి నుంచి ఢాకా వెళ్తోంది. ఈ క్రమంలో రాజ్‌బారిలోని దౌలాడియా టెర్మినల్ వద్ద బుధవారం (మార్చి 25) సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బస్సు పద్మా నదిని దాటేందుకు రవాణ పడవను ఎక్కుతుండగా అదుపుతప్పి బస్సు నదిలో పడిపోయింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, డైవర్ల సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. దాదాపు ఆరు గంటలు శ్రమించి బస్సును బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.  ఈ ప్రమాదంలో గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తుకు ఆదేశించారు.