Reading Time: < 1 minute

హైదరాబాద్ లో షార్ట్ సర్క్యూట్ తో హాస్పిటల్లో మంటలు

Caption of Image.
  •    బయటకు పరుగులు తీసిన పేషెంట్లు, వారి సహాయకులు
  •     మెహిదీపట్నం శ్రుతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఘటన

మెహిదీపట్నం, వెలుగు: ఓ ప్రైవేటు హాస్పిటల్లో మంటలు చెలరేగడంతో పేషెంట్లతోపాటు వారి సహాయకులు బయటకు పరుగులు తీశారు. మెహిదీపట్నం సీఐ మల్లేశ్, స్థానికుల వివరాల ప్రకారం.. విజయ్​నగర్ కాలనీలోని శృతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూడో అంతస్తులో ఏసీ ఆన్ చేసిన కొద్దిసేపటికే షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. 

సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆసుపత్రిలోని రోగులు, వారి బంధువులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న మెహిదీపట్నం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ ఘటనతో విజయ్​నగర్ కాలనీలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఏసీ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.