Reading Time: 2 minutes
Ms Dhoni Opens Up On Ipl Retirement Says I Can Play Till 60 In Light Moment

MS Dhoni IPL Retirement: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనీ తన రిటైర్మెంట్‌పై సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడయంలో నిర్వహించిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానుల కార్యక్రమంలో ఎంఎస్‌ ధోనీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ, ప్రస్తుత సీఎస్కే ఆటగాళ్లు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రముఖ నటుడు శివ కార్తికేయన్‌ సరదాగా ధోనీని రిటైర్మెంట్ గురించి అడుగుతూ, ఇంకా చాలా కాలం ఆడాలని కోరారు. దీనికి స్పందించిన ధోనీ నవ్వుతూ, “నేను 60 ఏళ్ల వరకు ఆడగలను.. కానీ, అది కష్టమే, అయినా ప్రయత్నిస్తాను” అని చెప్పాడు. ఈ వ్యాఖ్యతో స్టేడియంలో ఉన్న వేలాది మంది అభిమానులు “ధోనీ… ధోనీ…” అంటూ నినాదాలు చేస్తూ ఆనందంలో మునిగిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.

ధోనీ ఐపీఎల్ కెరీర్
* ఎంఎస్‌ ధోనీ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరు: 278 మ్యాచ్‌లు ఆడిన ఆయన.. 5,439 పరుగులు చేశారు.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను 5 సార్లు ఛాంపియన్‌గా నిలిపారు.. అతను ఐపీఎల్ 2026లో తన 19వ సీజన్ ఆడనున్నాడు.

జట్టులో ధోనీ పాత్రలో మార్పులు:
ఇటీవలి సీజన్లలో ధోనీ పాత్రలో కొన్ని కీలక మార్పులు కనిపిస్తున్నాయి.. కెప్టెన్సీని వదిలి రుతురాజ్ గైక్వాడ్‌ కు బాధ్యతలు అప్పగించారు.. బ్యాటింగ్ ఆర్డర్‌లో దిగువ స్థానంలో ఫినిషర్‌గా ఆడుతున్నారు.. ఇంపాక్ట్ ప్లేయర్ నియమం కారణంగా పరిమిత పాత్ర పోషిస్తోన్న విషయం విదితమే.. సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ ప్రకారం, ధోనీ 2026 సీజన్‌లో పూర్తి స్థాయిలో ఆడే అవకాశమున్నప్పటికీ, అతని పాత్రలో మార్పులు ఉండవచ్చు.

ఇదే చివరి సీజనా?
ఎంఎస్‌ ధోనీ రిటైర్మెంట్‌పై ఇంకా స్పష్టత లేకపోయినా, ఐపీఎల్ 2026 అతని చివరి సీజన్ కావచ్చనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. గత సీజన్‌లో సీఎస్కే ప్రదర్శన నిరాశాజనకంగా ఉండటంతో, ఈసారి జట్టుకు ధోనీ అనుభవం చాలా కీలకం. మొత్తంగా ఐపీఎల్ 2026 సీఎస్కేకు కొత్త ఆరంభం కావచ్చు, అదే సమయంలో ధోనీ కెరీర్‌కు ముగింపు అధ్యాయం కూడా కావచ్చు. అయితే, అతను మైదానంలో ఉన్నంతకాలం అభిమానులకు మ్యాజిక్ చూపిస్తాడనే నమ్మకం మాత్రం మారదు.