Reading Time: < 1 minute
Team India: కెప్టెన్‌గా సంజూ శాంసన్.. ఓపెనర్‌గా సూర్యవంశీ.. ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు ఇదే..?

India tour of Ireland 2026: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీమిండియా రాబోయే పర్యటనలకు సంబంధించిన కీలక అప్‌డేట్స్ విడుదల చేసింది. 2026 టీ20 ప్రపంచ కప్ టైటిల్ కైవసం చేసుకున్న తర్వాత భారత్ ఆడబోయే మొదటి టీ20 సిరీస్ ఐర్లాండ్‌తో జరగనుంది. జూన్ 2026లో భారత పురుషుల జట్టు ఐర్లాండ్‌లో పర్యటించి, అక్కడ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది.

ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, గత ఎనిమిదేళ్లలో భారత్ మూడుసార్లు ఐర్లాండ్‌లో పర్యటించినప్పటికీ, అవన్నీ డబ్లిన్ సమీపంలోని మలాహిడ్‌లోనే జరిగాయి. కానీ 2007 తర్వాత మొదటిసారిగా భారత్ బెల్ ఫాస్ట్‌లో అడుగు పెట్టబోతోంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 26న మొదటి టీ20, జూన్ 28న రెండో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

సంజు శాంసన్‌కు సారథ్య బాధ్యతలు?

ఐర్లాండ్ వంటి జట్లతో ఆడేటప్పుడు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి యువ ప్రతిభను ప్రోత్సహించడం బీసీసీఐ ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌ను ఈ సిరీస్ కోసం కెప్టెన్ గా నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో జట్టులో సభ్యుడిగా ఉన్న సంజుకు, ఇప్పుడు తన అనుభవంతో జట్టును ముందుండి నడిపించే అరుదైన అవకాశం దక్కవచ్చు.

ఓపెనింగ్ జోడీలో మార్పులు, బిజీ షెడ్యూల్..

ఈ పర్యటనలో ఓపెనింగ్ స్థానాల కోసం కూడా భారీ పోటీ నెలకొంది. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మలకు విశ్రాంతినిచ్చే యోచనలో ఉన్న బోర్డు, వారి స్థానాల్లో యశస్వి జైస్వాల్ లేదా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీలలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది.

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు షెడ్యూల్ చాలా బిజీగా ఉండబోతోంది. తొలుత అఫ్ఘానిస్తాన్‌తో ఒక టెస్ట్, మూడు వన్డేల సిరీస్ ఆడి, అది ముగిసిన వెంటనే జూన్ 20న ఐర్లాండ్ బయలుదేరుతుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత జులై 1 నుంచి 19 వరకు ఇంగ్లాండ్‌లో ఐదు టీ20లు, మూడు వన్డేల భారీ సిరీస్‌లో భారత్ పాల్గొంటుంది. అంటే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్ సిరీస్ టీమిండియాకు ఒక అద్భుతమైన సన్నాహకంగా ఉపయోగపడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..