Reading Time: < 1 minute

వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో పోటీపై MIM చీఫ్ అసదుద్దీన్ కీలక ప్రకటన

Caption of Image.

కోల్‎కతా: వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో పోటీపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక ప్రకటన చేశారు. హుమాయున్ కబీర్ నేతృత్వంలోని జనతా ఉన్నయన్ పార్టీతో కలిసి పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో   ఎంఐఎం పోటీ చేస్తుందని ప్రకటించారు. 2026, మార్చి 25న కోల్‌కతాలో కబీర్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. పొత్తుపై ప్రకటన చేసిన ఓవైసీ.. సీట్ షేరింగ్ గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 

హుమాయున్ కబీర్ ఎవరంటే..?

భరత్‌పూర్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ టీఎంసీ బహిష్కృ నేత. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మసీదు నమూనాలో కొత్త మసీదు నిర్మాణం చేపట్టడంతో అతడిని టీఎంసీ సస్పెండ్ చేసింది. దీంతో జనతా ఉన్నయన్ పేరుతో గతేడాది డిసెంబర్‎లో హుమాయున్ కబీర్ కొత్త రాజకీయ పార్టీ స్థాపించాడు. టీఎంసీకి పోటీగా త్వరలో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పోటీకి సిద్ధమయ్యాడు.

గతంలో టీఎంసీ నుంచి తాను గెలిచిన భరత్‌పూర్ స్థానం నుంచి కబీర్ మళ్లీ బరిలోకి దిగతున్నాడు. దీంతో పాటు ముర్షిదాబాద్ జిల్లాలోని రెజినగర్, నౌడా అనే రెండు నియోజకవర్గాల నుంచి కూడా అతడు పోటీ చేయనున్నాడు. కాగా, 294 మంది సభ్యులు గల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి 2026, ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2026, మే 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. బెంగాల్‎లో అధికారమే లక్ష్యంగా టీఎంసీ, బీజేపీ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. 

 

©️ VIL Media Pvt Ltd.