Reading Time: 2 minutes
Kavitha Sensational Comments On Kcr Ktr Brs Defeat

ఢిల్లీ లిక్కర్ కేసులో కోర్టు క్లీన్ షీట్ ఇచ్చిన వేళ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత పార్టీ నాయకత్వంపై యుద్ధం ప్రకటించారు. లిక్కర్ కేసు కారణంగానే బీఆర్ఎస్ రెండు ఎన్నికల్లో ఓడిపోయిందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీ ఓటమికి బాధ్యతను తన మీదకు తోసేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేస్తూ, అసలు ఓటమికి దారితీసిన పరిస్థితులను బహిరంగంగా విశ్లేషించారు.

లిక్కర్ కేసు వల్ల పార్టీకి నష్టం జరిగిందన్న వాదనలో అసలు లాజిక్ లేదని కవిత కొట్టిపారేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ ఒక్క స్పీచ్‌లో కూడా తన కేసు గురించి ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. విపక్షాలు తనపై దాడి చేస్తున్నా, పార్టీ నాయకత్వం కనీసం స్పందించి జవాబు ఇచ్చే ప్రయత్నం చేయలేదని గుర్తు చేశారు. అంతేకాకుండా, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన చాలా కాలానికి, అంటే మార్చి నెలలో తన అరెస్ట్ జరిగిందని, అలాంటప్పుడు అంతకుముందే వచ్చిన ఎన్నికల ఫలితాలకు ఈ కేసు ఎలా కారణమవుతుందని ఆమె సూటిగా నిలదీశారు.

Fatty Liver Diet : వారంలోనే ఫలితం.. ఫ్యాటీ లివర్ తగ్గించే అద్భుతమైన డైట్ ప్లాన్.!

బీఆర్ఎస్ పతనానికి లిక్కర్ స్కామ్ కారణం కాదని, పార్టీ అగ్రనేతల అహంకారమే అసలు కారణమని కవిత కుండబద్దలు కొట్టారు. ప్రజలు వద్దని మొత్తుకున్నా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే మళ్లీ టికెట్లు ఇచ్చి ప్రజల నెత్తిన రుద్దడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. “నేను ఎవరిని నిలబెట్టినా మీరు ఓటు వేయాలి” అనే నిరంకుశ ధోరణితో వ్యవహరించడం వల్ల ప్రజలు విసిగిపోయారని, ఆ అహంకార ధోరణే పార్టీని ఓడించిందని ఆమె విమర్శించారు. నేతలు ప్రజలకు ఎంతలా దూరమయ్యారంటే.. సామాన్య కార్యకర్తలకు నేతల దర్శనం కంటే దేవుడి దర్శనమే సులభంగా దొరికేంతగా పార్టీ మారిపోయిందని ఎద్దేవా చేశారు.

తనపై కేసు నడుస్తున్న సమయంలోనే మునుగోడు వంటి ఉపఎన్నికల్లో పార్టీ గెలిచిన విషయాన్ని కవిత గుర్తు చేస్తూ, అప్పుడు లేని నష్టం ఇప్పుడే ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేవలం పార్టీ లోటుపాట్లను, వ్యూహాత్మక తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఓటమి భారమంతా తన మీదకు, ఈ కేసు మీదకు నెట్టడం సరికాదని కేటీఆర్‌కు హితవు పలికారు. ఇటువంటి అబద్ధాలు , నీలాపనిందల వల్లే మనసు విరిగిపోయిందని ఆమె భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. సొంత పార్టీ నుంచే తనకు ఎదురవుతున్న ఈ పరిణామాలపై ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Cholesterol Control : చెడు కొలెస్ట్రాల్ మాయం.. మీ గుండె పదిలం..! ఈ ఆహారమే మందు..