Reading Time: 2 minutes
Ayesha Meera Case Remains Buried In Tenali After Cbi Closes Investigation

Ayesha Meera: 2007లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు ఇంకా స్పష్టతకు రాకపోవడంతో.. తాజాగా ఆమె శరీర అవశేషాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కేసును క్లోజ్ చేసిన అనంతరం అవశేషాలను తల్లిదండ్రులకు అందజేశారు. అనంతరం సొంతూరు తెనాలిలోని ముస్లిం శ్మశాన వాటికలో అవశేషాలను ఖననం చేశారు. విజయవాడ కోర్టు ప్రాంగణంలో తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్‌లకు అవశేషాలు అప్పగించగా.. అక్కడి నుంచి తెనాలి తీసుకువచ్చి ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దల సమక్షంలో ఖననం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల కార్యకర్తలు, స్థానికులు భారీగా హాజరై “జోహార్ ఆయేషా మీరా… వి వాంట్ జస్టిస్” అంటూ నినాదాలు చేశారు.

TVS Apache RTR 200 vs Bajaj Pulsar NS200: పవర్, స్టైల్, బడ్జెట్.. ఏది బెస్ట్?

ఈ కేసు సీబీఐ దర్యాప్తులోకి వెళ్లిన తర్వాత 2019లో రీ-పోస్ట్‌మార్టం కోసం సమాధి నుంచి శరీర భాగాలు సేకరించారు. అయితే తాజాగా సీబీఐ దర్యాప్తు చేయాల్సిన అంశాలు ఇంకేమీ లేవని తేల్చి కేసును మూసివేసింది. దాంతో అవశేషాలను కుటుంబానికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. అవశేషాల ఖననం అనంతరం ఆయేషా మీరా తండ్రి ఇక్బాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హత్య జరిగిన రోజు రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు ఏం జరిగిందో వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి చేత జుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని కోరారు. అప్పటి దర్యాప్తు అధికారులు, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రతి డిసెంబర్ 27ను ఆయేషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించాలని, ఆమె పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద బాలికల విద్యకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ViRosh: పెళ్లి తర్వాత తొలిసారి.. ఎయిర్‌పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక జంట సందడి.!

18 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నప్పటికీ ఫలితం రాలేదని ముస్లిం మత పెద్దలు మండిపడ్డారు. పోలీస్ యంత్రాంగం ఎందుకు కళ్లుమూసుకుందని ప్రశ్నించారు. ఈ ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. శ్మశాన వాటికలో జరిగిన ఖననం కార్యక్రమం భావోద్వేగభరిత వాతావరణంలో ముగిసింది. అయినప్పటికీ, ఆయేషా మీరా కేసులో పూర్తి స్థాయి నిజాలు వెలుగులోకి రావాలనే డిమాండ్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.