
జైపూర్: వధువు వరుడిని వాకింగ్ తీసుకెళ్లి తన ప్రియుడితో చంపించి అనంతరం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని నాటకమాడి దొరికిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శ్రీగంగానగర్‌కు చెందిన ఆశిష్‌కు మూడు నెలల కిందట అంజూతో పెళ్లి జరిగింది. భర్తతో ఎడా పెడా మొహంగా ఉండడంతో దంపతుల మధ్య గొడవలు జరిగాయి. ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకొని కూతురుకు నచ్చజెప్పి అల్లుడితో అత్తారింటికి తల్లిదండ్రులు పంపించారు. జనవరి 30న రాత్రి తొమిది గంటలకు తన భర్తతో కలిసి అంజూ వాకింగ్ వెళ్లింది. అదే సమయంలో ఆమె ప్రియుడు తన స్నేహితులతో కలిసి ఆశిష్‌పై దాడి చేసి హత్య చేశారు. భార్య భర్తలు ఇద్దరు రోడ్డుపై అపస్మారక స్థితిలో ఉండడంతో పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే భర్త మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తమపై దొంగలు దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని పోలీసులకు అంజూ తెలిపింది. భార్య ఒంటిపై గాయాలు లేకపోవడంతో పోలీసులు అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించారు. తన ప్రియుడితో కలిసి హత్య చేయించానని ఒప్పుకోవడంతో అంజూ, ఆమె ప్రియుడు, స్నేహితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ హత్య కూడా మేఘాలయ హనీమూన్ హత్య మాదిరిగా ఉంది.