Reading Time: 2 minutes

మనతెలంగాణ/హైదరాబాద్:వాణిజ్య పన్నుల శాఖలో ఫేక్ జిఎస్టీ రి జిస్ట్రేషన్‌లు హవాలాకు రాచమార్గంగా మారాయి. ఫేక్ జిఎస్టీ రిజిస్ట్రేషన్‌లు చేయించుకునే వారు లేని వ్యాపారాలను చూపించి వాటిల్లోకి హవాలారూపంలో నల్లధనాన్ని బదిలీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి కొందరు సెంట్రల్, రాష్ట్ర జిఎస్టీ అధికారులు వత్తాసు పలుకు తున్నారని, కమీషన్‌లు తీసుకొని ఇలాంటి వ్యాపారులను కొందరు అధికారులు ప్రోత్సహిస్తున్నారన్న విమర్శ లు వినిపిస్తున్నాయి. ఫేక్ జిఎస్టీని రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలో కొందరు అక్రమార్కులు చూపించే ఆఫీసు అడ్రస్, బిల్లులు, లావాదేవీలు అంతా డొల్లవేనని వాటిపై నిఘా వేయాల్సిన అధికారు లు ముడుపులు తీసుకొని వారిని కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హవాలా ద్వారా కొట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని ఇందులో రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, స్క్రాప్ బిజినెస్ చేసే వారితో పాటు పలు రంగాలకు చెందిన ఫేక్ వ్యాపారులు ఉన్నట్టుగా తెలిసింది. పస్తుతం జీఎస్టీలోని లోపాలను ఆసరాగా చేసుకొని సెంట్రల్, రాష్ట్ర జీఎస్టీ అధికారులను మచ్చిక చేసుకొని ఫేక్ రిజిస్ట్రేషన్‌లతో కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొందరు అధికారులు ఇలాంటి డొల్ల కంపెనీలపై చర్యలు చేపట్టినా ఆ అధికారులపై కొందరు ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చి రాజీ చేయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాదాపూర్, బేగంపేట్, పంజాగుట్ట, చార్మినార్, హైదరాబాద్ రూరల్, సరూర్‌నగర్ డివిజన్‌లలో ఫేక్ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌లు అధికంగా చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. ఫేక్ రిజిస్ట్రేషన్ చేసిన కంపెనీలు ఇలాంటి కేసుల నుంచి బయటపడడానికి ఎక్స్‌టెన్డ్ టర్నోవర్ పేరుతో ప్రభుత్వ ఆదాయానికి కుచ్చుటోపి పెడుతున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఒక అదనపు కమిషనర్ షాడో క మిషనర్‌గా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తు తం కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రెటరీగా రఘునందన్ రావు వ్యవహరిస్తున్నారు. ఆయన కమిషనర్‌గా, ప్రిన్సిపల్ సెక్రెటరీగా పూర్తిస్థాయిలో విధులు నిర్వహించలేకపోవడంతో ఇదే అదనుగా ఒక అడిషనల్ కమిషనర్ ఉద్యోగులందరిపై పెత్తనం చెలాయిస్తున్నారని, తనకు నచ్చని వారిని ఇబ్బందులు పెడుతున్నారని ఆశాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయి కమిషనర్ పోస్టులో మరో ఐఏఎస్‌ను నియమించాలని ఆ శాఖ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

డిఈఓకు 7 నెలల జీతం అడ్వాన్స్‌గా….

కొందరు ప్రైవేటు వ్యక్తులు (డిఈఓలుగా) పనిచేసే వారిపై భారీగా అవినీతి ఆరోపణలు వచ్చినా వారినే మళ్లీ కొనసాగిస్తూ వారిని ముడుపులు తీసుకోవడానికి వినియోగించుకుంటున్నట్టుగా ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రభుత్వం తొలగించిన డిఈఓల్లో కొందరు రీఫండ్ కేసులో ఉన్నారని, ఈ మధ్యే వారిని విధుల్లోకి తీసుకొని పాతదందాను అధికారులు కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వీస్ మ్యాటర్‌లో పనిచేసే ఒక డిఈఓకు (ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి) ఏకంగా 7 నెలల జీతం అడ్వాన్స్‌గా ఒక అధికారి ఇప్పించారని ఆ శాఖ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ శాఖలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు సమయానికి రాక ఇబ్బంది పడుతుంటే, ఆయనకు మాత్రం 7 నెలల అడ్వాన్స్ జీతం ఇవ్వడంపై ఆ శాఖ ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. ఇక, సి, డి సెక్షన్‌ల సూపరింటెండెంట్‌లపై భారీగా అవినీతి ఆరోపణలు వచ్చినా వారిపై చర్య తీసుకోవడం లేదని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. సి,డి సెక్షన్‌లో రెగ్యులర్ ఉద్యోగులు లేకపోవడంతో ఈ సెక్షన్‌ల సూపరింటెండెంట్‌లు అందినకాడికి దండుకుంటున్నారని ఉన్నతాధికారులు సైతం వారిని వెనకేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విచారణ జరగకుండా అడ్డుకట్ట…..

గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేసిన అధికారులు వ్యాపారులకు నోటీసులు ఇచ్చి వారి నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదు అందడంతో ఈ ముడుపుల బాగోతంలో ఉన్నతాధికారులు, జేసిలు, కిందిస్థాయి అధికారుల పాత్రపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే, ఈ విచారణ జరగకుండా కొందరు ఉన్నతాధికారులు అడ్డుకోవడంతో పాటు ఈ కేసులో ఉన్న వారికి మంచి పోస్టింగ్‌లు ఇస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వ్యాపారులకు నోటీసులు ఇచ్చిన కేసులో విజిలెన్స్ శాఖ సైతం విచారణ జరిపిందని త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందచేసే అవకాశం ఉందని తెలిసింది.