
ఎన్నికలలో పోటీకి అర్హత సాధించాలంటే కుమార్తెను అడ్డుతొలగించాలని ఆలోచించిన ప్రబుద్ధుడు. చివరకు కన్నబిడ్డను కడతేర్చాడు. కూతురిని నమ్మించి బయటకు తీసుకొచ్చిన తండ్రి.. కాలువలోకి తో సి దారుణంగా హతమార్చాడు. మానవత్వం మంటగలిసిన ఈ దారుణ ఘటన ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. కేసుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య మీడియాకు వెల్లడించారు. జ నవరి 29న ఎడపల్లి మండలం ఎఆర్‌పి క్యాంపు శివారులోని నిజాంసాగర్ కెనాల్ (డి-46/8)లో ఆరేళ్ల గుర్తు తెలియని చిన్నారి మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి, బోధన్ ఏసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి ఫోటోను సామాజిక మాద్యమాలలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈక్రమంలో ఎడపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన పిసి-630 సుధీర్ తన వాట్సాప్ స్టేటస్‌లో ఉంచిన ఫోటోను మహారాష్ట్రలోని ముఖేడ్ గ్రామస్తులు గుర్తించి,
పాప ప్రాచి కొండమంగలే అని పోలీసులకు సమాచారం అందించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలుకా కెరూర్ గ్రామానికి చెందిన కొండమంగలే పాండురంగకు ముగ్గురు పిల్లలు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలని అతను ఆశపడ్డాడు. నిబంధనల ప్రకారం ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హుడు. దీనిపై ప్రస్తుత సర్పంచ్ గణేష్ షిండేతో కలిసి చర్చించిన పాండురంగ, తన ముగ్గురు పిల్లలలో ఒకరిని తక్కువ చేసుకుంటే ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పథకం వేశాడు. ఒక బిడ్డను చంపేసి తప్పిపోయినట్టు నమ్మించాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకా రం… తండ్రి పాండురంగ తన పెద్ద కూతురు ప్రాచిని బైక్‌పై మాయమాటలు చెప్పి ఎడపల్లికి తీసుకువచ్చాడు. పాపను నిజాంసాగర్ కాలువలోకి తోసేసి పరారయ్యాడు. పోలీస్ దర్యాప్తులో గుట్టు రట్టుకావడంతో.. పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.