Reading Time: < 1 minute

రంగారెడ్డి జిల్లా, మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మోకిల పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శంకర్ పల్లి మండల పరిధిలోని దొంతాన్ పల్లి ఐసిఎఫ్ ఏఐ యూనివర్సిటీలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు, ఎంజిఐటి కళాశాలకు చెందిన ఒకరు స్పోర్ట్స్ కారులో కోకాపేట్‌లో బర్త్‌డే వేడుకలకు వచ్చారు. పార్టీ అనంతరం వారిని ఎంజీఐ విద్యార్థి రోహిత్ డ్రాప్ చేయడానికి వచ్చాడు. కారు అదుపుతప్పి మిర్జాగూడ గేటు వద్ద అర్ధరాత్రి చెట్టును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక విద్యార్థిని గాయపడగా ఆమెను చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతులు సూర్య తేజ (20), సుమిత్ (20), నిఖిల్ (18), రోహిత్ (20)గా గుర్తించారు, విద్యార్థిని నక్షత్ర(20) తీవ్రంగా గాయపడడంతో ఆమెను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రోహిత్ మిగతా స్నేహితులను డ్రాప్ చేయడానికి వచ్చి ఉండవచ్చునని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు మోకిల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.