Reading Time: < 1 minute

మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి ఈ సంక్రాంతికి తన తదుపరి చిత్రం ’అనగనగా ఒక రాజు’తో అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. అసలుసిసలైన పండగ చిత్రంగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టనున్న ’అనగనగా ఒక రాజు’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. కింగ్ నాగార్జున అందించిన వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఊరి పెద్దమనిషిలా బుల్లెట్ బండి మీద నవీన్ పొలిశెట్టి పాత్రను పరిచయం చేసిన తీరు బాగుంది. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి పాత్రలను మలిచిన తీరు, ఆ పాత్రల నుంచి హాస్యాన్ని పుట్టించిన తీరు కట్టిపడేసింది. ఈ సంక్రాంతికి థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే లక్ష్యంగా ’అనగనగా ఒక రాజు’ చిత్రం తెరకెక్కిందని ట్రైలర్ తో స్పష్టమైంది.

హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకలో కథానాయకుడు నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ “ఈ సంక్రాంతికి మీ కుటుంబంతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా సినిమాని రూపొందించాం. మొదటి నుంచి చివరివరకు నవ్వుతూనే ఉంటారు. అదే సమయంలో అందమైన భావోద్వేగాలు కూడా ఉంటాయి. దర్శకుడు మారి మొదటి సినిమా అయినా చాలా బాగా తెరకెక్కించారు”అని అన్నారు. దర్శకుడు మారి మాట్లాడుతూ.. “ట్రైలర్ అందరికీ నచ్చింది కదా. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంది. మొదటి నుంచి చివరివరకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. నవీన్‌ని కొత్తగా చూస్తారు. సంక్రాంతికి తగ్గ ఓ మంచి వినోదభరిత చిత్రమిది”అని తెలిపారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ‘ట్రైలర్‌లో ఎలాగైతే పంచ్‌లు పేలాయో.. సినిమా అంతా అలాగే పంచ్ లు పేలుతాయి. రెండు గంటల పాటు మిమ్మల్ని నవ్విస్తూ నవీన్ శైలిలో సాగే సినిమా ఇది. కుటుంబంతో కలిసి సినిమాకు రండి. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు”అని పేర్కొన్నారు.