
ప్రమాద వశాత్తూ తండ్రులను కోల్పోయిన ఇద్దరు బడుగు బిడ్డలకు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఆర్ధిక సాయం చేసి మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. విద్యుత్ ప్రమాదంలో ఇటీవల మరణించిన ఎర్రవెల్లి గ్రామ నివాసి పేద రైతు చిన్రాజు సత్తయ్య కుమారుడు, స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్ చదువుతున్న నవీన్, అదే గ్రామానికి చెందిన ప్రమాదవశాత్తూ కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన,మరో పేద రైతు పెద్దోళ్ల సాయిలు కొడుకు, బి.టెక్ చదువుతున్న అజయ్‌లను చేరదీసి వారి ఇంజనీరింగ్ చదువు పూర్తి కాలపు ఫీజులను కెసిఆర్ చెల్లించారు. వారికి అవసరమయ్యే పుస్తకాలు, కంప్యూటర్ల కోసం కూడా ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు గురువారం వారికి వేర్వేరుగా చెక్కులు అందజేశారు. కష్టపడి చదువుకుని గొప్ప స్థాయిని చేరుకోవాలని కెసిఆర్ ఆకాంక్షించారు.
ఫీజులకోసం భయపడొద్దు అని,ఏ సమస్య వచ్చినా తాను ఉన్నానంటూ వారికి భరోసా ఇచ్చారు. కాగా.. విద్యుత్ ప్రమాదంలో మరణించిన చిన్రాజు సత్తయ్య కుటుంబానికి సంబంధిత విద్యుత్ శాఖ నుంచి చట్టపరంగా అందే ఆర్థిక తదితర సాయం గురించి పర్యవేక్షించి వారికి న్యాయం జరిగేలా చూడాలని తన వ్యక్తిగత కార్యదర్శి నాగేందర్ రెడ్డిని కెసిఆర్ ఆదేశించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన తమను గుర్తించి, ఆదరించి, ఆర్థికంగా ఆదుకుని, తమ పిల్లల చదువు, భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన కెసిఆర్‌కు విద్యార్థుల తల్లులు ధన్యవాదాలు తెలిపారు. తమ చదువుకోసం భరోసాగా నిలిచిన కెసిఆర్‌కు ఎర్రవెల్లి గ్రామానికి చెందిన పేద విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.