Reading Time: < 1 minute

పునె : పశ్చిమ కనుమల పరిరక్షణ యోధుడు, పర్యావరణ శాస్త్రవేత్త, పద్మభూషణ పురస్కార గ్రహీత మాధవ్ గాడ్గిల్ (83) స్వల్ప అస్వస్థతతో పుణె లోని ఆస్పత్రిలో బుధవారం రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు, మాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ప్రపంచం లోనే అత్యంత జీవ వైవిధ్యాన్ని కలిగిన పశ్చిమ కనుమల్లో పర్యావరణ పరిరక్షణకు ఆయన ఎనలేని కృషి చేశారు.

అభివృద్ధి పేరిట అక్కడ జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై అలుపెరుగని పోరాటం చేశారు. పశ్చిమ కనుమల్లో పర్యావరణ పరిరక్షణకు ఎనలేని కృషి చేసినందుకు 2024 ఏడాదికి ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం “ ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డ్ ” ఆయనకు లభించింది. ఆయన మృతితో దేశ పర్యావరణ రంగంలో ఓ శకం ముగిసిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశం లోని పర్యావరణ సున్నిత ప్రాంతంపై జనాభా ఒత్తిడి, వాతావరణ మార్పులు, అభివృద్ధి పనులు ఏ విధమైన ప్రభావం చూపిస్తాయో అధ్యయనం చేసే ప్రభుత్వ కమిటీకి ఆయన అధ్యక్షునిగా నియామకమయ్యారు. 1942 మే 24న పుణెలో జన్మించిన గార్గిల్ విద్యావంతుల కుటుంబానికి చెందినవారు.