Reading Time: 2 minutes

మాజీ సిఎం కెసిఆర్‌కు పేరొస్తుందని, ఎపి సిఎం చంద్రబాబుకు కోపం వస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడం లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు చేయడకుండా రెండేళ్లుగా రేవంత్‌రెడ్డి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. పాలమూరుపై పగబట్టి కేవలం 10 శాతం పనులు చేయడం లేదని విమర్శించారు. నార్లాపూర్, కరివెన, వట్టెం, ఏదుల, ఉద్దండాపూర్ రిజర్వాయర్లు అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ కాల్వల పనులను రద్దు చేసి పునఃప్రారంభించకపోవడం పాలమూరుకు నీటిని అందనీయకుడదన్న కుట్ర అని పేర్కొన్నారు. నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద కెసిఆర్ స్వయంగా బటన్ నొక్కి 145 మెగావాట్ల పవర్‌తో పంపులను నడిపించి కృష్ణా నీటిని ఉప్పొంగించిన రోజు పాలమూరు ప్రజలు చూశారని చెప్పారు. తెలంగాణ భవన్‌లో గురువారం కొల్లాపూర్ నియోజకవర్గ చేర్గానికి పలువురు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం, రాష్ట్రంలోని రైతుల దారుణ పరిస్థితి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మంత్రి జూపల్లి కృష్ణారావు ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. తెలంగాణలోని రైతన్నలను అష్టకష్టాల పాలు చేస్తున్న రైతు వ్యతిరేకం ప్రభుత్వం ఇది అని విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలే అని పేర్కొన్నారు. చెక్‌డ్యామ్‌లు కట్టాల్సిన చోట అవే చెక్‌డ్యామ్‌లను పేల్చడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా కనిపించని అత్యంత దిగజారిన రాజకీయమని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చెక్ డ్యామ్‌లు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తోందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ వస్తుందో రాదో నాకు తెలీదు, నేను గెలుస్తానో లేదో కూడా తనకు తెలీదు అని గత ఏడాది అదిలాబాద్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారని గుర్తుచేశారు.

జూపల్లి తమ పార్టీలో ఉన్నప్పుడు కెసిఆర్ గురించి ఎలా గొప్పగా మాట్లాడాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని, ఇప్పుడు మంత్రి పదవి కాపాడుకునేందుకు అడ్డగోలుగా మాట్లాడుతునారని మండిపడ్డారు. కొల్లాపూర్‌లో జూపల్లి అరాచకాల్ని ఎదుర్కొని బిఆర్‌ఎస్ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిందని అన్నారు. మున్సిపల్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో బలంగా గెలిచి కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి బిఆర్‌ఎస్ శ్రేణులు ఏకమై పనిచేయాలని సూచించారు.కెసిఆర్ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. సంక్రాంతి తర్వాత తిరిగి కొల్లాపూర్‌లో పర్యటిస్తామని కెటిఆర్ తెలిపారు.