
ఎపి మాజీ సిఎం జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలపై ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాటలతో రాయలసీమ వెళ్లి రొయ్యల పులుసు తిన్న కెసిఆర్ దొంగతనం బయటపడిందన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని బిఆర్‌ఎస్ చూస్తోందన్నారు. ఎపి ప్రయోజనాలకు అనుకూలంగా రేవంత్ రెడ్డి వ్యవహారిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను సిఎంగా ఉన్నప్పుడు కెసిఆర్‌తో మాట్లాడి కృష్ణా నదీ జలాలను అక్రమంగా తీసుకువెళ్లినట్లు జగన్ చెప్పారని ఎంపి చామల పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాలను ఎక్కువ టిఎంసీలు ఎపికి తరలించడంలో తాను సక్సెస్ అయ్యానని, చంద్రబాబు ఫెయిల్ అయ్యారని జగన్ చెప్పారని ఎంపి చామల ఆరోపించారు. కెసిఆర్ ఆశీర్వాదంతో తెలంగాణ రైతులను మోసం చేశానని జగన్ చెప్పారన్నారు. కెసిఆర్, జగన్ లాలూచీ పడి తెలంగాణ నీళ్లను అక్రమంగా ఏపికి తరలించారని ఎంపి చామల ఆరోపించారు. జగన్ వ్యాఖ్యలతో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న విషయం తేటతెల్లమయ్యిందని ఆయన అన్నారు.