
ట్రంప్ కీలక నిర్ణయం…పనికిరానివని ప్రకటన
వేటుకు గురైన వాటిలో పలు ఐరాస అనుబంధాలు
భారత్-ఫ్రాన్స్‌ల సంయుక్త సోలార్ కూటమిపై వేటు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 60కి పైగా ప్రపంచ సంస్థల నుంచి అమెరికా వైదొలుగుతోందని, ఈ మేరకు కీలక ప్రకటనపై తాను సంతకాలు చేసినట్లు గురువారం ట్రంప్ తమ అధికారిక ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు అమెరికా వైదొలిగిన సంస్థలలో ఐరాసకు చెందిన సంస్థలు, భారత్ ఫ్రాన్స్ సారధ్యపు సౌరశక్తి కూటమి వంటివి కూడా ఉన్నాయి. ఈ సంస్థలతో అమెరికా అనుబంధం దేశానికి భారం అవుతుంది. పైగా దేశ ప్రయోజనాలకు విరుద్ధం అవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంతకాల తరువాత ప్రకటించారు. అమెరికాకు పనికిరాని ఒప్పందాలు, కట్టుబాట్లతో కొనసాగాల్సిన అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రత్యేకించి ఐరాస పరిధిలోని సంస్థలతో కూడా అమెరికా తెగతెంపులకు దారితీసే నిర్ణయానికి దిగడం కీలక పరిణామం అయింది.
ట్రంప్ కీలక నిర్ణయంతో ఇక వైట్‌హౌస్ ద్వారా ఆయా అంతర్జాతీయ సంస్థలకు అమెరికా నుంచి ఎటువంటి నిధులు ఇతరత్రా సాయం అందడానికి వీల్లేకుండా పోతుంది. ఆయా సంస్థలు అమెరికాకు ఎందుకూ పనికిరావు, దేశ ప్రయోజనాలుచ భద్రత, ఆర్థిక వికాసం, లేదా సర్వసత్తాకతకు భంగం కల్గించేలా ఇవి పనిచేస్తున్నాయని నిర్థారించుకుని, ఇక ఏ కోశాని ఈ భారం మోయాల్సిన అవసరం లేదని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక భారత్ ఫ్రాన్స్‌ల చొరవతో సంయుక్తంగా ఏర్పాటు అయిన అంతర్జాతీయ సోలార్ అలయెన్స్ (ఐఎస్‌ఎ)కు కూడా నిధులు నిలిచిపోతాయి. సౌర శక్తి పరిష్కారాలతో పర్యావరణ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు అయిన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం భారత్‌లోనే ఉంది. దీనిని 2015లో పారిస్‌లో జరిగిన కాప్ 21 సదస్సు నేపథ్యంలో ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో క్రమేపీ ఆ తరువాత ఐరాస సభ్య దేశాలన్ని కూడా చేరాయి.