Reading Time: 2 minutes

కేంద్ర ప్రభుత్వం నిషేదించిన హెచ్‌టి (హెర్బిసైడ్ టాలరెంట్)పత్తి విత్తనాలను రైతులు కొనవద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను కోరారు. పత్తి విత్తనాల ప్యాకేట్లపై అధికారులతో సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు రాష్ట్రంలో అనధికారకంగా, అనుమతిలేని పత్తి విత్తనాల ప్యాకెట్ల అమ్మకాలను అరికట్టాలని మంత్రి తుమ్మల అన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతిలేని హెచ్‌టి (హెర్బిసైడ్ టాలరెంట్) పత్తి విత్తనాలను రాష్ట్రంలో అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హెచ్‌టి, బిజి 3 పత్తి రకాన్ని అమెరికాకు చెందిన మోన్సాంటో కంపెనీ కనుగొన్నప్పటికి, ఫీల్డ్ ట్రయల్స్ లో ఫెయిల్ అవడం, దీని వలన పర్యావరణానికి కలిగే అనర్థాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ పత్తి రకానికి అనుమతులు ఇవ్వలేదని మంత్రి తెలిపారు. కొందరు దళారులు తమ ప్రయోజనాల కోసం రైతులకు హెచ్‌టి పత్తి విత్తనాలను అనధికారకంగా రైతులకు అంటగడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 20 అధీకృత పత్తి విత్తన కంపెనీలు విత్తనోత్పత్తి చేస్తున్నాయని, ప్రభుత్వం సర్టిఫైడ్ చేసిన మరో 40 వివిధ కంపెనీలు రాష్ట్రానికి పత్తి విత్తన ప్యాకెట్లను సరఫరా చేస్తున్నాయన్నారు. గత సంవత్సరం ఈ కంపెనీల ద్వారా సరఫరా అయిన 1.10 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లను రైతుల కొనుగోలు చేశారని మంత్రి చెప్పారు. కొందరు దళారులు కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన హెచ్‌టి విత్తనాలతో పాటు కల్తీ విత్తనాలను మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలోని రైతులకు అమ్ముతున్నట్టు గుర్తించామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 52 లక్షల ఎకరాలలో పత్తి సాగయ్యే అవకాశం ఉందని, దీనిని ఆసరా చేసుకొని దళారులు హెచ్‌టి విత్తనాలు, కల్తీ విత్తనాలను రాష్ట్రంలోకి తెచ్చే అవకాశం ఉందని, ఈ నెల నుంచే సరిహద్దు ప్రాంతాలలో టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసిన పత్తి విత్తనాల అక్రమ రవాణాలను అరికట్టే విధంగా నిఘా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

అదే విధంగా కో- మార్కెటింగ్ కు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హెచ్‌టి పత్తి విత్తనాలను రైతులు కొనుగోలు చేయకుండా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కలుపును తట్టుకుంటుందని, అధిక దిగుబడి వస్తుందని హెచ్‌టి పత్తి విత్తనాలను కొనవద్దని మంత్రి రైతులను కోరారు. ఈ విత్తనాలను వాడటం వలన అధికంగా కలుపు మందు వాడాల్సి వస్తుందని, దీంతో పర్యావరణానికి హాని కలగడంతోపాటు జీవ వైవిధ్యం దెబ్బతిని, ఇతర పత్తి హైబ్రిడ్ లు కూడా కలుషితం అవుతాయని మంత్రి వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, విత్తన కంపెనీల అధికారులు తదితరులు పాల్గొన్నారు.