
జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది. ఈ క్రమంలో మేడారం అభివృద్ధికి ప్రభుత్వం రూ.230 కోట్లతో విస్తృత పనులు చేపట్టింది. ఈ మహాజాతరకు సర్కార్ పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులకు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికలను అధికారికంగా అందజేశారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను సర్కార్ ఆహ్వానించింది. గురువారం మంత్రులు సీతక్క, కొండా సురేఖలు.. ఎర్రవల్లిలోని కెసిఆర్ నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు. మేడారం జాతరకు రావాలని మంత్రులు స్వయంగా ఆహ్వానం పత్రిక అందజేశారు.
కాగా, ఈ నెల 19న సమ్మక్క-సారలమ్మల గద్దెలు, ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు. సరికొత్తగా అభివృద్ధి చేసిన మేడారం ఆలయ ప్రాంగణం మరో వెయ్యి సంవత్సరాల పాటు నిలిచేలా, పూర్తిగా రాతి కట్టడాలతో నిర్మితమవుతోంది. సమ్మక్క సారలమ్మల త్యాగాలు, ఆదివాసీల చరిత్ర ప్రతిబింబించేలా ద్వారాలు, ప్రహరీలు రూపొందించారు. ఆదివాసి సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆధునికత సమ్మేళనంగా మేడారం ముస్తాబైంది. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు మేడారాన్ని దర్శించుకుంటున్నారు.