
అమరావతి: నదీ గర్భంలో నిర్మాణాలు కడుతున్నారని ప్రజల్ని వైసిపి తప్పుదోవ పట్టిస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. నదీ గర్భంలో రాజాధాని కట్టడంలేదని, మాజీ సిఎం జగన్ హయాంలో కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 3 వేల కోట్లు ఇవ్వలేదని అన్నారు. జగన్ రాజధాని వ్యాఖ్యలపై నారాయణ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బుధవారం నుంచి ల్యాండ్ ఫూలింగ్ ప్రారంభించామని, రాజధాని పనులకు బ్రేక్ వేసేందుకు వైసిపి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లీగల్ గా ఎలాంటి ఇష్యూ లేకుండా వర్క్ చేస్తున్నామని, వర్షాల వల్ల అమరావతి పనులు జరగలేదని తెలియజేశారు. టిడిపి అధికారంలోకి రాగానే అమరావతి పునర్ నిర్మాణం చేపట్టామని, రాజధాని మాస్టర్ ప్లాన్ ఏంటి అనేదానిపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రివర్ బెడ్ అంటే ఏంటి? రివర్ బేస్ మెంట్ అంటే ఏంటనేది తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. జగన్ మోహన్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం తప్పు అని.. వాస్తవాలు తెలియకుండా ప్రజలను తప్పుదోవ పట్టించుడం తగదు అని అన్నారు. రెండో విడత భూసమీకరణకు రైతులు ముందుకు వస్తున్నారని, జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి ఆగదు అని హెచ్చరించారు. రాబోయే ఏడాదిన్నరలో ట్రంక్ రోడ్లు పూర్తి చేస్తామని, రెండున్నరేళ్లలో లేఔట్ రోడ్లు పూర్తి చేస్తామని అన్నారు. మూడేళ్లలో ఐకానిక్ భవంతుల నిర్మాణం పూర్తి చేస్తామని, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే 11 సీట్లు..సున్నాకు చేరుకుంటాయని నారాయణ పేర్కొన్నారు.