Reading Time: < 1 minute

హైదరాబాద్: సాగునీటి విషయంలో రాష్ట్రాన్ని బిఆర్ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్, బిఆర్ఎస్ నదీ జలాల అంశాన్ని తెరపైకి తెచ్చాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నదీ జలాల విషయంలో రాష్ట్ర వాటాను కాంగ్రెస్ వాడుకోలేదని, కృష్ణా జలాల అంశంలో ప్రజలను మాజీ సిఎం కెసిఆర్ పదేపదే మోసం చేశారని విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటాను పూర్తిగా వాడుకోలేదని, తెలంగాణకు నీటి అవసరం ఉన్నప్పటికీ వాడుకోలేదని తెలియజేశారు. కాంగ్రెస్, కెసిఆర్ చేసిన మోసాలు చూస్తే తనకు ఆశ్చర్యం వేసిందని, కృష్ణా జలాల్లో తెలంగాణకు 571 టిఎంసిలు రావాలని బండి సూచించారు. 571 టిఎంసిలు రావాల్సి ఉంటే.. 299 టిఎంసిలకే కెసిఆర్ ఒప్పుకున్నారని, 299 టిఎంసిలకు కెసిఆర్ ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంది? అని ప్రశ్నించారు. రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం పరిస్థితి ఏమైందని అందరికీ తెలిసిందేనని అన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక పాలమూరు ప్రాజెక్టు పేరుతో దోపిడీకి తెరలేపారని, పాలమూరు ప్రాజెక్టులో కాలువల నిర్మాణం, లిఫ్టుల పేరుతో వ్యయం అంచనాలు పెంచారని విమర్శించారు. బిఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత బయటపడుతోందని, అక్రమాలను ఎవరు బయటపెట్టినా బిజెపి అండగా ఉంటుందని బండి సంజయ్ పేర్కొన్నారు.