
అమరావతి: స్వలాభం కోసం ఎపి సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఎంతటి ద్రోహమైనా చేస్తారని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రాయలసీమకు, నెల్లూరుకు ఆ ప్రాజెక్టు సంజీవని వంటిదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎపి సిఎం చంద్రబాబుకు రహస్య ఒప్పందం ఉందని తెలుస్తోందని, చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను తాకట్టు పెట్టారని విమర్శించారు. 800 అడుగులలోపే 2 టిఎంసిల నీళ్లు తీసుకునేలా తెలంగాణలో పాలమూరు- రంగారెడ్డి మొదలు పెట్టారని, రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వెనుక గొప్ప ఆలోచన ఉందన్నారు. శ్రీశైలం నుంచి రోజుకు 8 టిఎంసిలు నీళ్లు అవుతుంటే ప్రాజెక్టు ఎప్పుడు నిండుతుందని, కిందున్న రాయలసీమ, నెల్లూరు పరిస్థితి ఏంటి? అని, ఈ విషయంలో చంద్రబాబు ఏ రోజైనా ఆలోచన చేశారా? అని జగన్ ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడుకు 101 టిఎంసిల కేటాయింపు ఉన్నాయని, కానీ..20 ఏళ్లలో రెండు, మూడు సార్లే ఆ నీటిని తీసుకున్నామని గుర్తు చేశారు. ఇలాంటి చరిత్ర హీనులు దేశంలో ఉండరని విమర్శించారు.
రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదని మాట్లాడుతున్నారని, చంద్రబాబు మౌనం వల్ల శ్రీశైలం భాగంలో తెలంగాణ ప్రాజెక్టులు చేపట్టిందని తెలియజేశారు. ఎస్ఎల్ బిసి 45 టిఎంసిలు తరలించేలా పనులు చేస్తున్నారని, 777 అడుగుల నుంచే ఎడమవైపు పవర్ హౌస్ ద్వారా 4టిఎంసి నీళ్లను తెలంగాణ ఖాళీ చేస్తోందని పేర్కొన్నారు. నీళ్లు లేకుండా మనం ఇబ్బందులు పడుతున్నామని, రాష్ట్రానికి, రాయలసీమ ప్రయోజనానికి విఘాతం కలిగించేలా చంద్రబాబు నిర్ణయాలు ఉన్నాయని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. రాయలసీమ లిప్ట్ వాస్తవాలు అందరికీ తెలియాలని, రాయలసీమ లిప్ట్ ను ఆపించాలని తెలంగాణ సిఎం ప్రకటించారని తెలియజేశారు. ఈ పరిస్థితిని చక్కబెట్టడం కోసం వైఎస్ హయాంలో చర్యలు తీసుకున్నామని, 800 అడుగుల్లోనే 3 టిఎంసిలు తీసుకునేలా రాయలసీమ ఎత్తిపోతల చేపట్టామని అన్నారు. అక్కడ కట్టింది రిజర్వాయర్ కాదు..స్టెబిలైజింగ్ రిజర్వాయర్ అని ఎపి ప్రజలకు నష్టం జరగకుండా చూడాల్సిన ధర్మం తమకు ఉందని జగన్ పేర్కొన్నారు.
భోగాపురం ఎయిర్ పోర్టు పేరుతో క్రెడిట్ చోరీ చేస్తున్నారని, ఎయిర్ పోర్టు పేరుతో భూ దోపిడీకి పాల్పడాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో భోగాపూరం ఎయిర్ పోర్ట్ పనులు వేగంగా జరగాలని చూశామని, మొదటి 15 వేల ఎకరాలని..తర్వాత 5 వేల ఎకరాలు కావాలన్నారని అన్నారు. 2,700 ఎకరాల భూసేకరణను తమ ప్రభుత్వంలోనే పూర్తి చేశామని, మూడు గ్రామాల్లో 400 కుటుంబాలను తరలించామని అన్నారు. కేంద్రమంత్రి గడ్కరీ భోగాపురం తమ డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పారని, చంద్రబాబు, సివిల్ ఏవియేషన్ మంత్రి.. క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి హయాంలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు వెళ్లిపోయారని దుష్ర్పచారం చేస్తున్నారని, నిజాలు బయటకు వచ్చేలోపు చంద్రబాబు అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయని అన్నారు. తమ హయాంలో తయారీ రంగంలో దేశంలోనే ఎపి ఐదో స్థానంలో ఉందని, చంద్రబాబు తప్పుడు ప్రచారాలను బద్ధలు చేస్తూ ఆర్ బిఐ నివేదిక ఇచ్చిందని తెలిపారు.
ఇలాంటి ప్రచారాలు చంద్రబాబుకు అలవాటైనవేనని చురకలంటించారు. సౌత్ ఇండియా ఎపి మొదటి స్థానంలో ఉందని, తమ హయాంలో పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటులో ఎపి దేశంలో ఐదో స్థానం.. సౌత్ ఇండియా ఫస్ట్ ప్లేస్ ఉందని తెలియజేశారు. చంద్రబాబు హయాంలో పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతున్నారన్నది వాస్తవం అని చెప్పారు. వీళ్లకు కప్పం కట్టకపోతే రాష్ట్రంలో పరిశ్రమను నడిపే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. పారిశ్రామిక ప్రతిపాదనల్లో దేశంలో ఎపి నెంబర్ వన్ అంటున్నారని కొనియాడారు. ఎమ్ఎస్ఎమ్ఇ సెక్టార్ లో వైసిపి హయాంలో 32 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని, టిడిపి హయాంలో తొమ్మిదున్నర లక్షల ఉద్యోగులు ఇచ్చారని అన్నారు. ఇవి చంద్రబాబు రిలీజ్ చేసిన డాక్యుమెంట్లలోని లెక్కలేనని, ఎవరి హయాంలో విధ్వంసం జరిగింది? ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలు బెదిరిపోతున్నారని? నిలదీశారు. పరిశ్రమల పేరుతో చంద్రబాబు చేసేవన్నీ స్కాములేనని, పరిశ్రమల ముసుగులో తన మనుషులు, బినామీలకు భూములను కారుచౌకగా కట్టబెట్టుతున్నారని జగన్ ఆరోపణలు చేశారు.