
హైదరాబాద్: బిఎం బిర్లా సైన్స్ సమాజం కోసం ఆలోచించడం.. పనిచేయడమే లక్ష్యంగా కృషిచేస్తుందని మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. తెలుగు పత్రికారంగంలో విప్లవాన్ని సృష్టించిన రామోజీరావు ఒక ధ్రువతార అని కొనియాడారు. బిఎం బిర్లా సైన్స్ సెంటర్లో ల్యాబ్ టూ సొసైటీ రోల్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ బిన్ బిల్డింగ్ వీబీ-20 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాస్త్రీయ అంశాలకు ప్రముఖ స్థానం కల్పిస్తున్నారని, తెలుగు పాఠకులకు శాస్త్ర విజ్ఞానాన్ని అందించాలని రామోజీరావు తాపత్రయపడ్డారని తెలియజేశారు. శాస్త్రవిజ్ఞానాన్ని నాలుగు గోడల మధ్య ఆగిపోకూడదని.. ప్రజలకు చేరాలని అన్నారు. శాస్త్రవిజ్ఞానం ప్రజల ముంగిట చేరాలని.. ఆదరణ, అవగాహన పెరగాలని.. సైన్స్ పట్ల విద్యార్థుల్లో ఉత్సుకతను పెంచాలని సూచించారు. శాస్త్రీయ జ్ఞానాన్ని ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేరవేయాలని, సమాజంలో శాస్త్ర సాంకేతికతపై నమ్మకాన్ని పెంపొందించడం మరింత అవసరమని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
క్లిష్టమైన సైన్స్ అంశాలను సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా బిఎం బిర్లా సైన్స్ సెంటర్లో జ్ఞాననేత్రం శీర్షికను ప్రచురిస్తున్నారని కొనియాడారు. సైన్స్ పట్ల ఎంత ఆదరణ పెంచగలిగితే.. సైన్స్ లో దేశం అంత ముందుంటుందని, మానవ జీవన నాణ్యత పెంచడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర కీలకమని అన్నారు. ఎంఎస్. స్వామినాధన్ కృషి వల్లే ఆహార రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించిందని, హరిత విప్లవం వల్ల వ్యవసాయరంగంలో కీలక పురోగతి సాధించామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు బదిలీ చేసేందుకు పాశ్చాత్య దేశాలు నిరాకరించాయని, స్వదేశీ పరిజ్ఞానంతోనే తక్కువ ఖర్చుతో కలాం, విక్రమ్ సారాభాయ్ ఉపగ్రహాలు, క్షిపణులు తయారు చేశారని ప్రశంసించారు. ప్రస్తుతం ఉపగ్రహాలు, క్షిపణులు ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుందని కొనియాడారు. శాస్త్ర విజ్ఞానంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉండాలనేది మన లక్ష్యం కావాలని, ఒకప్పుడు భారత్ విశ్వగురుగా ఉండేదని.. జ్ఞానం సంపాదించుకునేందుకు విదేశాల నుంచి వచ్చేవారని అన్నారు. విదేశాల నుంచి నలంద, తక్షశిల, విక్రమశిల వర్సిటీలకు వచ్చేవారని, కొంతమంది దురాక్రమణ వల్ల ప్రముఖ విశ్వవిద్యాలయాలు నాశనమయ్యాయని వెంకయ్యనాయుడు తెలియజేశారు.