
నాగోల్: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు… పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులను ఒప్పించాడు. ఫోన్‌లో మాట్లాడుతున్నావని వేధించడంతో యువతి వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఖమ్మం జిల్లాకు చెందిన ఐశ్వర్య(19) తన సోదరుడు అరవింద్‌తో కలిసి బండ్లగూడ సమీపంలోని తట్టిఅన్నారంలోని వైఎస్‌ఆర్ కాలనీలో నివసిస్తోంది. ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. సూర్యాపేట జిల్లాకు చెందిన వీరి బంధువు మహేష్ అలియాస్ ఆనంద్(23) ఆటో నడుపుతూ హస్తినాపురంలో నివసిస్తున్నాడు. ఆనంద్ బంధువు కావడంతో పలుమార్లు ఐశ్వర్య వాళ్ల ఇంటికి వచ్చాడు. పరిచయం కావడంతో పేమించాలని ఐశ్వర్యను బలవంతం చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె ఓకే చెప్పింది. యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. కానీ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని మహేష్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. ప్రియురాలు తరచూ వేరివారితో ఫోన్‌లో మాట్లాడుతుందని ఆమెపై అతడు అనుమానం పెంచుకున్నాడు. జనవరి 5న హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వద్దకు ఇద్దరు చేరుకొని మాట్లాడారు. ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నావని అనుమానం వ్యక్తం చేయడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. మనస్థాపం చెందిన ఐశ్వర్య వెంటనే ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి దూకింది. వెంటనే ఆమెను నాగోల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం చనిపోయింది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మహేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.