Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్:ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది.ఈ మేరకు గురువారం (8న) ఉదయం 11 గంటల కు గాంధీ భవన్‌లో కీలక విస్తృత స్థాయి సమావే శం జరగనున్నది. పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసిసి కార్యదర్శులు, ఇన్‌ఛార్జి మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులూ హాజరుకానున్నారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల కన్నా మెరుగైన ఫలితాలు సాధించేలా పార్టీ యం త్రాంగాన్ని సమాయత్తం చేసేందుకే ఈ ప్రత్యేక కీలక విస్తృత స్థాయి సమావేశం ముఖ్యోద్ధేశమని పార్టీ వర్గాలు తెలిపాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచుల స్థానాలను కైవసం చే సుకున్నా, బిఆర్‌ఎస్ కూడా కొంత ఉనికిని చాటుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో పార్టీ నేతల మ ధ్య సమన్వయం కొరవడడంపైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నారు.

కాబట్టి పార్టీ నే తలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులపై మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు బాధ్యతను పెట్టబోతున్నారు. అత్యంత కీలకమైన మున్సిపల్ ఎన్నిక ల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ తీసుకునే జాగ్రత్తలకు సంబంధించిన మార్గదర్శకాలను చెప్పానున్నారు.మున్సిపల్ ఎన్నికల్లో వంద శాతం విజయం సాధించడమే ప్రధాన లక్షంగా చర్చించేందుకు అజెండా రూపొందించారు. అయితే ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకం జరిగిన సంగతి తెలిసిందే. కాగా, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి)లకు మిగతా కార్యవర్గం ఏర్పాటు కావాల్సి ఉంది. గురువారం జరగబోయే సమావేశానికి కార్యవర్గం కూర్పుతో హాజరై తమకు నివేదికలు అందజేయాల్సిందిగా మూడు రోజుల క్రితం మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ ద్వారా జిల్లా పార్టీ అధ్యక్షులను ఆదేశించారు. ఈ కూర్పులో పార్టీ కోసం నిరంతరం శ్రమించే వారికి ప్రాధాన్యతనివ్వాలని, అంతేకాకుండా యువతకు పెద్ద పీట వేయాలని సూచించారు. దీంతో పాటు ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మహిళ, మైనారిటీలకూ కార్యవర్గంలో సముచిత ప్రాధాన్యతనివ్వాలని వారు సూచించారు. కార్యవర్గం కూర్పు ఆశించిన విధంగా లేకపోతే తిరస్కరిస్తామని కూడా వారు అప్రమత్తం చేశారు.

కొత్త పాత కలయికతో మున్ముందుకు..

పార్టీ కార్యవర్గం కూర్పులో ఇతర పార్టీల నుంచి చేరిన వారికీ గౌరవప్రదమైన స్థానం కల్పించాలని ఇదివరకే ఆదేశించారు. రాబోయే ఎన్నికల్లోనూ వారిని కలుపుకుని పోవాలని, ఇంకా చురుకైన వారికి పోటీ చేసేందుకు అవకాశం కల్పించే విషయంపైనా ఈ కీలక విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వందకు వంద శాతం విజయం సాధించేలా ముఖ్య నేతల ప్రసంగాలు ఉండబోతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్ కుటుంబ కలహాలతో సతమతమవుతున్నందున ప్రజల్లో బలహీనపడిందని, ఇదే తరుణంగా అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను వారిపై నేతలు మోపనున్నారని పార్టీ ముఖ్య నేతల ద్వారా తెలిసింది.