Reading Time: 3 minutes

ఐదు వందల సంవత్సరాల క్రితం యురోపియన్లు ఇప్పుడు గ్లోబల్ సౌత్ అని పిలిచే దేశాలను జయించడానికి బయలుదేరారు. సహజ సంపదతో తులతూగుతున్న ప్రపంచాన్ని కనుగొన్నారు. మొదట వెండిని, బంగారాన్ని, అనంతరం వజ్రాలను తవ్వి తీసుకున్నారు. తర్వాత సుగంధద్రవ్యాలు, మిరియాలు, జాజికాయ, ఏలకులు, అరటిపండ్ల కోసం వచ్చారు. వారు ద్వీపాలను జయించి, గ్లోబల్ సౌత్ లోని ఇతర ప్రాంతాల నుంచి బానిసలను కూడగట్టి, అడవులను నరికించి ఆ భూములలో వారికి అవసరమైన చక్కెర, టీ, కాఫీ, రబ్బరు పండించడానికి తోటలు పెంచారు. తర్వాత వారు చమురు, సహజ వాయువును కనుగొన్నారు. ఐదువందల సంవత్సరాల నాటి గ్లోబల్ వెస్ట్ నేడు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) సభ్యత్వం ద్వారా గుర్తింపు పొందుతోంది. ఇది ప్రధానంగా పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు నెలవు. క్రమంగా ప్రపంచ దేశాలను జయిస్తూ, ప్రజలను బానిసలుగా చేస్తూ, వలస పాలనలను స్థాపించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వనరులను సేకరించడం ఆరంభమైంది. గత శతాబ్దంలో విద్యుత్, ఆటోమొబైల్‌ను కనుగొన్నారు. చమురు కొత్త బంగారంగా మారింది. అమెరికాలో చమురు నిల్వలు కనుగొనబడినా, పశ్చిమాసియాలో చాలా పెద్దఎత్తున చమురు, సహజవాయువు నిల్వలు కొనుగొనబడ్డాయి. బ్రిటీష్ ఈ ప్రాంతం పై నియంత్రణ సంపాదించింది.

హిట్లర్ దానిని వెదుక్కుంటూ బయలుదేరాడు కానీ ఓడిపోయాడు. అమెరికా రంగంలోకి దిగి, వనరులను తన అధీనంలోకి తీసుకుంది. బ్రిటన్, ఫ్రాన్స్ అప్పటికే అరబ్ అగ్రరాజ్యాలను సృష్టించడంలో, స్వతంత్ర దేశాలుగా తీర్చిదిద్దడంలో కీలకంగా వ్యవహరించాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆవిర్భావంలోనూ ముఖ్యభూమిక వహించాయి. తర్వాత బ్రిటన్, అమెరికా ఓల్డ్ టెస్టమన్‌లోని కొన్ని భాగాలను ఉటంకిస్తూ, ఓ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని సృష్టించి, దానికి ఇజ్రాయెల్ అని పేరు పెట్టాయి. ఓ పోలీస్ వ్యవస్థగా రూపుదిద్దుకున్నాయి. షేక్ లను అదుపులో ఉంచుకోవడం ద్వారా పశ్చిమ దేశాలకు చౌకగా చమురు గ్యారంటీ కల్పించడం ఇజ్రాయెల్ పని. సౌదీ అరేబియాలోని ప్రభుత్వం పాశ్చాత్య దేశాలు ఆడించినట్లు ఆడడానికి నిరాకరించినప్పుడు. ఆ ప్రభుత్వాన్ని కూలదోసి, రాజుగా ఓ తోలుబొమ్మను నిలిపారు.

ఈ చరిత్రను దృష్టిలో ఉంచుకుంటే, అమెరికా మరో చమురు సంపన్న గణతంత్ర రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి సిద్ధపడడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు కేవలం చమురు కాదు, ఖరీదైన రకరకాల ఖనిజాలు, సంపన్నమైన భూములపై అమెరికా కన్నుపడింది. ప్రపంచవ్యాప్తంగా చమురుకు విపరీతమైన డిమాండ్, చమురు సరఫరా చేసే దేశాలు పరిమితంగా ఉండడంతో అమెరికా డాలర్ ప్రపంచపు ఏకైక కరెన్సీ అయింది. చైనా అతి తక్కువ కాలంలో బలమైన శక్తిగా ఆవిర్భవించి ఒక శతాబ్దంలో మొదటిసారిగా అమెరికన్ ఆధిపత్యాన్ని, భౌగోళిక- ఆర్థిక ఆధిపత్యాన్ని సవాల్ చేసింది. చైనాను నేరుగా ఎదుర్కొనలేక, దాని పెరుగుదలను అడ్డుకోలేక, ఎంతో ప్రయత్నించినా ఆపలేక అమెరికా ప్రాంతీయ ఆధిపత్యం సాధించాలనే తన పాత సిద్ధాంతాని తిరిగి వెలుగులోకి తెచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిని డోన్రో సిద్ధాంతం అని పిలుస్తారు. ఈ పేరు 19వ శతాబ్దపు మన్రో సిద్ధాంతాన్ని భౌగోళిక రాజకీయ జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది.

1823లో అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మన్రో ప్రకటించిన ఈ సిద్ధాంతం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలకు విస్తరించి ఉన్న పశ్చిమ అర్థగోళం ఇకనుంచి యురోపియన్ సామ్రాజ్యవాదానికి దూరంగా ఉందని పేర్కొంది. అంటే పశ్చిమ దేశాలకు ఈ సిద్ధాంతం వర్తించదు. స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, బ్రిటన్ అన్నీ గతంలో ఈ రెండు ఖండాలలోని వివిధ ప్రాంతాలను జయించాయి. 19వ శతాబ్దంలో బలమైన శక్తిగా మారిన అమెరికా, ఈ ప్రాంతంపై తన భౌగోళిక రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో సోవియెట్ యూనియన్ ఈ సిద్ధాంతాన్ని సవాల్ చేసింది. ఫిడేల్ కాస్ట్రో క్యూబాతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఒక దశలో రెండు సూపర్ పవర్ దేశాలు అణు ఘర్షణ అంచులకు చేరాయి. ఫిడేల్ కాస్ట్రోను పదవీచ్యుతుడిని చేయడానికి చాలా తీవ్రంగా అమెరికా ప్రయత్నించింది. కానీ ఇప్పటివరకూ క్యూబా విప్లవాన్ని అణచివేయడంలో విజయం సాధించలేకపోయింది. బహుశా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ మంత్రి క్యూబా అమెరికన్ మార్క్ రుబియో ఇప్పుడు ఈ లక్ష్యాన్ని సాధించాలని కలలు కంటున్నాడు. క్యూబా, బ్రెజిల్, కొలంబియా వంటి మిత్రదేశాలపై నియంత్రణ సాధించే ముందు ట్రంప్ బలహీనమైన వెనెజువెలాను లక్ష్యంగా చేసుకున్నారు.

వెనెజువెలాలో పాలన ఎలా ఉన్నా, మాదకద్రవ్యాల ఆరోపణలు ఉన్నా, ఏదిఏమైనా దేశాధినేతను అపహరించి పాలన మారేలా శాసించడం తీవ్రంగా ఖండించదగిన విషయం. ఈ సూపర్ పవర్ గూండా చర్యను భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించకపోవడం దిగ్భ్రాంతికరం కాకపోయినా విచారకరం. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాల రక్షకుడిగా తనను తాను చెప్పుకుంటున్న దేశం జరిగిన దానిని ఖండించకుండా కేవలం చింతించాల్సిన అవసరం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి విషయంలో భారతదేశం అనుసరిస్తున్న మౌనమే ఇక్కడా అనుసరిస్తోందని సమాంతరంగా చూపేందుకు చాలా మంది ప్రయత్నించారు. ఐక్యరాజ్యసమితి సాటి సభ్యదేశం సార్వభౌమత్వాన్ని రష్యా ఉల్లంఘించినప్పటికీ, జాతీయ భద్రతా సమస్యల నేపథ్యంలో ఉక్రెయిన్ నాటో సభ్యత్వం కోరుకోవడానికి ప్రేరణగా నిలిచింది. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత నాటో తూర్పు దేశాలకు విస్తరించడం రష్యా జాతీయ భద్రతకు తీవ్ర సవాల్‌గా పరిణమించింది.

వెనెజువెలా లోని మదురో పాలన అమెరికాకు ఎలాంటి సవాల్ విసరలేదు. ముప్పు కలిగించలేదు. నార్కో- టెర్రరిజం ఆరోపణను పూర్తిగా కొట్టిపారేశారు. ఏదిఏమైనా, ట్రంప్ తన చర్యను తాను డోన్రో సిద్ధాంతం అని పిలిచి, తనను తాను సమర్థించుకుంటున్నాడు. మరో మాట చెప్పాలంటే, అమెరికా తన ఇష్టాయిష్టాలను పొరుగుదేశాలపై రుద్దడానికి చట్టబద్ధమైన హక్కు కలిగి ఉంది. అరటిపండ్ల నుంచి అరుదైన భూములవరకూ అమెరికన్లు దోచుకుంటున్నారు. జాతీయ భద్రత అనేది ఒక సాకు, వనరులు దోచుకోవడమే నిజమైన ప్రేరణ. భారతదేశం తన సొంత జాతీయ ప్రయోజనాల కోసం డోన్రో సిద్ధాంతాన్ని తిరస్కరించాలి. జాతీయ భద్రతా ఆసక్తి లేని చోట, పెద్ద దేశాలు తమ పొరుగుదేశాలపై తమ ఇష్టాన్ని రుద్దే హక్కును అనుమతించకూడదు. భారతదేశంలో కొద్ది మంది మాత్రమే డోన్రో సిద్ధాంతాన్ని నేరుగా సవాల్ చేసి తిరస్కరించారు. భారతదేశం ఈ డోన్రో సిద్ధాంతాన్ని స్పష్టంగా తిరస్కరించాలి. భారతదేశం విశ్వగురు, విశ్వామిత్ర అని ప్రధాని నరేంద్ర మోడీ తరచు పేర్కొంటున్నారు. అయితే అమెరికా చర్య విషయంలో కనీసం మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహిం చేసినంత ధైర్యం చేయాలి. ఐక్యరాజ్యసమితి సభ్యదేశానికి చెందిన దేశాధినేతను, అతడి భార్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయాలి.

అమెరికా చేసిన ఈ చర్యను ట్రంప్ దేశంలో ఎలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నారో ఆలోచించాల్సిన విషయం. నాన్సీ పెలోసి, బెర్నీ సాండర్స్ నుంచి జోహ్రాన్ మమ్దానీ, రో ఖన్నా వరకూ డెమోక్రాటిక్ పార్టీ సీనియర్ నాయకులు అంతా ట్రంప్ చర్యను ఖండించారు. కొద్ది కాలంగా ట్రంప్ గ్రాఫ్ అమెరికాలో పడిపోతున్నదన్న విషయం గమనార్హం. ఆయనకు ప్రజాదరణ చాలా తగ్గింది. ఫలితంగా, ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల్లో హౌస్‌లో కాకపోయినా, సెనెట్‌లో రిపబ్లికన్ పార్టీ తమ మెజారిటీని కోల్పోతుందని భావిస్తున్నారు. ఇదంతా ప్రెసిడెంట్ ట్రంప్‌కు ఆవేదన కలిగించవచ్చు. స్వదేశంలో ఆదరణ కోల్పోతున్న రాజకీయ నాయకులు బాహ్య సవాళ్లను ఎత్తి చూపడం సర్వసాధారణం. 

సంజయ్ బారు