Reading Time: 2 minutes

శీతాకాలం వచ్చిందంటే దేశరాజధాని హస్తిన ప్రజానీకం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతికే దుస్థితి దాపురించింది. ఈ పరిస్థితి ఎముకలు కొరికే చలి కారణంగా వచ్చిందికాదు. ఊపిరిసైతం సలపనివ్వని వాయు కాలుష్యం కమ్ముకోవడమే అందుకు కారణం. ఒకవైపు పొగ మంచు, మరోవైపు వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితి గత పదేళ్లుగా ఉంటున్నదే. చలికాలం వచ్చిందంటే కాలుష్య నివారణ పేరిట ఎక్కడలేని హడావిడి చేసి, ఆ తరువాత చేతులు దులుపుకునే అసమర్థ ప్రభుత్వాల కారణంగా సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. గత పదేళ్లుగా ఢిల్లీలో సగటు వాయు నాణ్యత సూచీ 235కు పైగానే ఉంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్థారించిన స్థాయులకంటే ఇది చాలా ఎక్కువ. చలి కాలంలో ఢిల్లీలోని ప్రతి పౌరుడు పీల్చే గాలిలో 33-50 సిగరెట్లు తాగితే వెలువడేంత కాలుష్యం ఉంటోందన్న అంచనాలు హస్తిన పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఈ కాలుష్యాన్ని తట్టుకోలేకపోతున్నామంటూ దాఖలైన పలు పిటిషన్లపై తాజాగా విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సిఎక్యుఎం) చేతగానితనాన్ని తీవ్రపదజాలంతో ఎండగట్టడంతో ఢిల్లీ కాలుష్యం మరొకసారి పత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. ఢిల్లీ ఒక గ్యాస్ చాంబర్‌లా మారుతోందని సెంటర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ రీసెర్చ్‌కు చెందిన పరిశోధకులు సహా ఎందరో పర్యావరణవేత్తలు నెత్తీనోరూ మొత్తుకుంటున్నారు.

శీతాకాలంలో ఆస్తమా, న్యుమోనియా తదితర శ్వాసకోశ వ్యాధులతో జనం అల్లాడుతు న్నారు. కొన్ని సంపన్న కుటుంబాలు తాత్కాలికంగా హస్తినను విడిచి వేరే చోట మకాం చేస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ సైతం వాయు కాలుష్యం వాతబడి ఆస్పత్రి పాలు కావడం హస్తినలో కాలుష్యం తీవ్రతను కళ్లకు కడుతోంది. అయినా మార్పు తెచ్చేందుకు పాలకులు నడుం బిగించకపోవడమే విడ్డూరం. ఒకప్పుడు వాయు కాలుష్యంపై చైనా భారీ యుద్ధమే చేసింది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా పేరుపడిన దేశ రాజధాని బీజింగ్‌ను కాలుష్య రహితంగా మార్చేందుకు ఏళ్ల తరబడి అవిరామంగా కృషి చేసింది. బొగ్గు ఆధారిత బాయిలర్లపై నిషేధం వేటు వేసింది. కాలం చెల్లిన వాహనాలను నిర్దాక్షిణ్యంగా తుక్కుగా మార్చడమే కాదు, విద్యుత్ ఆధారిత వాహనాలను ప్రోత్సహించింది. వాటి కొనుగోలుపై భారీ రాయితీలు ఇచ్చింది. మరోవైపు ప్రజారవాణాను ప్రోత్సహించింది. జనారణ్యంలో ఉన్న పరిశ్రమలను ఊరవతలకు తరలించింది. భవంతు ల నిర్మాణంలో కాలుష్యం వెదజల్లకుండా ఆంక్షలు విధించింది. పంట వ్యర్థాల దహనంపై ఉక్కుపాదం మోపింది. నగర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచింది. చైనా చేపట్టిన ఈ బృహత్ ప్రయత్నం పదేళ్లు తిరిగేసరికల్లా ఫలించింది. వాయు కాలుష్యం చెప్పుకోదగిన రీతిలో తగ్గింది. ఢిల్లీ దురవస్థను గమనించిన చైనా ఇటీవల చేయూతను అందించేందుకు ముందుకొచ్చింది. స్వయంగా దేశ రాజధానిలోని చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి చొరవ తీసుకుని, కొన్ని పరిష్కార మార్గాలు సైతం సూచించారు. అలాగే బీజింగ్‌లో వాయు కాలుష్య నివారణకు తీసుకున్న చర్యలపై అధ్యయనం చేసేందుకు మన భారత బృందం ఒకటి స్వయంగా ఆ దేశంలో పర్యటించింది. అయినా చేతల వరకూ వచ్చేసరికి అధికారగణం మీనమేషాలు లెక్కించడం పరిపాటిగా మారింది. నిన్నమొన్నటివరకూ హస్తినలో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వానికి, కేంద్రంలోని ఎన్‌డిఎ కూటమికి పచ్చగడ్డివేస్తే భగ్గుమనేది.

వాయు కాలుష్యానికి కారణం మీరంటే మీరేనంటూ నెపాన్ని ఒకరి మీదకు ఒకరు నెట్టివేసుకుని బాధ్యతారహితంగా ప్రవర్తించేవి. ఇప్పుడు ఢిల్లీలో అధికారాన్ని చేపట్టిన బిజెపి ప్రభుత్వం కేంద్రంలోని పెద్దల సహకారంతో కాలుష్యభూతం భరతం పట్టించేందుకు అవకాశం ఉండగా, చేతులు ముడుచుకు కూర్చోవడం క్షమించరాని నేరం. కొత్తగా అధికార పగ్గాలు చేపట్టిన ఢిల్లీ ప్రభుత్వమూ, ఏడాదిన్నర క్రితం ఏర్పడిన సిఎక్యుఎం సంస్థ సైతం ఈ దిశగా చేపట్టిన చర్యలు శూన్యం. కాలుష్యం వెదజల్లుతోందనే కారణంపై చైనాలో షోగాంగ్ అనే అతి పెద్ద స్టీలు ఉత్పత్తి కంపెనీని వెనకాముందూ చూడకుండా ఊరవతలకు తరలించా రు. ఆ తరహాలో కఠిన చర్యలు తీసుకుంటే తప్ప వాయు కాలుష్యనుంచి ఢిల్లీకి విముక్తి కల్పించలేమన్నది నిర్వివాదాంశం. లేనిపక్షంలో ముంబయి, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా వంటి మహానగరాలను సైతం వాయు కాలుష్యం కమ్ముకోవడానికి ఎంతో సమయం పట్టదు. తస్మాత్ జాగ్రత్త!