Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తం గా గత ఏడాది డిసెంబర్‌లో మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా మున్సిప ల్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జ రుగుతున్నాయి.. వారం, పదిరోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరిలో పోలింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం బుధవారం జిల్లా కలెక్టరు, మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధిరులు వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. జనవరి 12వ తేదీ లో పు ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఈ సందర్భంగా ఆయా అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. ఈనెల 12 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ, 13 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల పరిశీలన ప్రారంభించాలని నిర్ణయించారు. ఈనెల 16న ఓటరు 

జాబితా విడుదల చేయాలని ఎస్‌ఈసీ అధికారులను ఆదేశించారు. అలాగే జనవరి 13న టీ పోల్ యాప్‌లో పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. ఇక జనవరి 16న పోలింగ్ స్టేషన్ల వారీగా ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితా ప్రచురించాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులు, అవసరమైన సామగ్రి సిద్ధం చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు ఎస్‌ఈసీ రాణి కుముదిని ఆదేశించారు. 2019 నాటి ఓటర్ల జాబితానే ప్రాతిపదికగా తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలింగ్ స్టేషన్లలో బీఎల్‌వోల ద్వారా ఓటర్ల వివరాలను పరిశీలన చేయాలని ఎస్‌ఈసీ సూచించింది. ఆన్‌లైన్‌లో కూడా ఓటరు నమోదు, మార్పులకు అవకాశం ఇచ్చిందని వివరించింది. ఎఫ్‌ఎస్‌టి, ఎస్‌ఎస్‌టి బృందాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేయాలని జారీ చేసిన ఆదేశాల్లో ఎస్‌ఈసీ స్పష్టం చేశారు.