
భారతదేశంలో వేలసంవత్సరాల అగ్రకుల ఆధిపత్య భావజాలం కేవలం రాజకీయ, ఆర్థిక రంగాల్లోనే కాకుండా, వెనుకబడిన వర్గాల మెదళ్లలోకి చొరబడింది. ఇటీవల దళిత మహిళా డాక్టర్ ఆత్మహత్య ఇందుకు నిదర్శనంగా నిలిచింది. తెలంగాణలో సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 23 ఏళ్ల దళిత హౌస్ సర్జన్ పేద కూలీ కుటుంబం నుంచి ప్రభుత్వ పాఠశాలలు, సామాజిక సంక్షేమ హాస్టళ్ల ద్వారా ఎంబిబిఎస్ వరకు చేరింది. ఆ యువతి, బిసి కంసాలి కులానికి చెందిన సీనియర్ డాక్టర్‌తో ప్రేమలో పడి, అతని వివాహ వాగ్దానాన్ని నమ్మింది. చివరకు ఆ యువకుడు వారి పెద్దల మాటలు నమ్మి కులభేదాన్ని చూపించి వెనక్కి తగ్గడంతో ఆమె మనోభారంతో ఆత్మహత్య చేసుకుంది. ఇది వ్యక్తిగత ప్రేమ విఫలం కాదు, అగ్రకుల భావజాలం బిసి వర్గాల మెదళ్లలో పెంచిన కుల దురహంకారానికి నిదర్శనం.
ఈఘటన రాజకీయ పార్టీలు, మీడియా ‘ప్రేమ విషాదం’గా చూపిస్తున్నప్పటికీ, దళితుల్ని బిసిల కంటే తక్కువనే విషబీజాన్ని నాటడం వల్లనే ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాకుండా బిసి, ఎస్‌సి కులాల్లో సైతం అంతర్గత కులవివక్ష కొనసాగుతుంది. దీంతో వివాహ సంబంధాలకు దూరంగా ఉంటున్నారు. ఇది అగ్రకుల దుర్విచక్షణ బిసి సమాజ మెదళ్లలో ఎంత లోతుగా చేరిందో అనే దానికి తాజా నిదర్శనం. ఈ దేశంలో దళితులు చదువుకున్నా, ఉద్యోగం చేసినా, నగరానికి వచ్చినా కులం వీడడం లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ వేముల ఒక సాధారణ విద్యార్థి కాదు. పిహెచ్‌డి స్కాలర్. అంబేద్కర్ స్టూడెంట్ లీడర్. అయినా అగ్రకులాలు దళితులపై కులవివక్ష, రాజకీయ దాడులు అతన్ని ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించాయి. ఇది దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది. ఎయిమ్స్‌లో దళిత విద్యార్థి బాల్ ముకుంద్ భారతి మెడిసిన్ చదవడానికి అర్హుడు కాదు అని అగ్రకుల అధ్యాపకుల అవమానాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఇంతటితో ఆగకుండా ఐఐటిలు, మెడికల్ కళాశాలల్లో సైతం కుల వివక్షతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఐఐటిలో 25% ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని సర్వేలు చెప్తున్నాయి. కుల వేధింపులతో హర్యానాకు చెందిన అడిషనల్ డిజిపి స్థాయి అధికారి పూరణ్ కుమార్ మరణం దేశవ్యాప్తంగా సంచలమైంది.
కరీంనగర్ పట్టణంలో ఇటీవల ఎస్‌సి, ఎస్‌టిలకు ఇల్లు అద్దెకి ఇవ్వబడదని ఓ ఇంటి యజమాని ఏకంగా బోర్డు పెట్టాడు. కావున పై ఉదాహరణల ద్వారా స్పష్టమవుతున్న విషయం ఏమిటంటే ఈ దేశంలో కులమే నిజం. చట్టాలు, రాజ్యాంగం ఉన్నా కులభూతం తొలగడం లేదు. ఇప్పటికే దళితుడు గుడిలోకి వెళ్లాడని కొట్టారు, గుర్రం ఎక్కాడని చంపారు, మీసం తిప్పాడని దాడి చేశారు, ప్రేమించాడని ఊచకోత కోశారు. నేడు కులం రూపం, పద్ధతి మారుతుంది, కానీ అణచివేత కొనసాగుతుంది. ఇది కేవలం దళితులకే పరిమితం కాలేదు. బిసి కులాల సైతం అక్కడక్కడ కులవివక్షకు, కులబహిష్కరణకు గురవుతున్న సందర్భాలు చూస్తున్నాం. అగ్రకులాలు కులాన్ని కులతత్వ సాధనాలుగా మారుస్తూ బిసి, ఎస్‌సి, ఎస్‌టిల మధ్య ఐక్యతను దెబ్బతీస్తున్నారు. బిసిలను ఎస్‌సిలపై ఎగ దోస్తూ, ఎస్‌సిలను బిసిలపై ఎగదోస్తూ రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారు. దీని అర్థం చేసుకోకుండా బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు నిత్యం విద్వేషాలతో రగులుతున్నారు.
వాస్తవంగా దళితులు అంటే విడగొట్టబడిన సమాజం. నేటి బిసి, ఎస్‌సి, ఎస్‌టిలంతా దళితులే. కానీ బిసిలను శూద్రులుగా, దళితులను అస్పృశ్యులుగా ముద్రవేసిన అగ్రకుల సిద్ధాంతం బిసి మెదళ్లలోనూ స్థిరపడింది. ఫలితంగా, అణచివేతకు గురైన బిపిలు కూడా కొంత విద్య, ఉద్యోగం, అవకాశంతో సామాజికంగా ఉన్నత స్థితికి చేరగానే తమను దళితుల కంటే ఉన్నతులుగా భావించడం జరుగుతుంది. ఈ అంతర్గత బ్రాహ్మణతత్వం సమాజంలో బిసి, ఎస్‌సిల మధ్య సంఘర్షణకు దారితీస్తున్నాయి. విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అగ్రకుల ఆధిపత్య భావజాలమే. దళిత బహుజనులు అగ్రకుల వర్ణ సిద్ధాంతంతో విడిపోయిన సామాజిక, రాజకీయ అనాథలే. ఈ విషయాన్ని అంబేద్కర్, ఫూలేల స్పష్టం చేశారు. వారి స్ఫూర్తితో గత కొన్ని నెలల నుంచి తెలంగాణలో 42% బిసి రిజర్వేషన్ కోసం బిసి రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో 90% బిసి, ఎస్‌సి, ఎస్‌టిలంతా ఉమ్మడిగా ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలో బిసి, ఎస్‌సిల మధ్య కులపరమైన అంతరాలు పెచ్చరిల్లడం, సామాజిక, రాజకీయ చైతన్యానికి ప్రమాదకరం. బిసిలు అంతర్గత అగ్రకుల తత్వాన్ని వీడాలి. తమ చారిత్రక నేపథ్యాన్ని, భారత రాజ్యాంగ విలువలను అర్థం చేసుకొని సమన్వయంతో ముందుకెళితేనే దళిత బహుజనులకు విముక్తి లభిస్తుంది.
సంపతి రమేష్ మహారాజ్, 79895 79428