
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ‘ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ముగ్గురు మంత్రులు మొనగాళ్ళు కాదు ..మోసగాళ్ళు’ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు. బుధవారం ఖమ్మం నగరంలోని తెలంగాణ భవనంలో జరిగిన బిఆర్‌ఎస్ నూతన సర్పంచులు, ఉప సర్పంచ్‌ల ఆత్మీయ అభినందన సభ లో ఆయన ప్రసంగించారు. తొలుత జిల్లా సరిహద్దులోని నాయకన్ గూడెం నుంచి ఖమ్మం నగరం వరకు పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో కెటిఆర్ మాట్లాడుతూ..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా రైతులకు యూరియా అందించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. డిప్యూటీ సిఎం సహా ముగ్గురు మంత్రులూ 30 శాతం చొప్పున కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రెవె న్యూ శాఖ మంత్రి కన్పించిన ప్రతి భూమిపైనే కమీషన్ వసూ ళ్ళు చేస్తున్నారని, భట్టి, పొంగులేటితోపాటు తుమ్మల కూడా అదే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు.
ఈ మోసగాళ్లకు అసలైన నాయకుడు ఆలీబాబా సిఎం రేవంత్‌రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వమని, సర్వే.. సర్వత్రా అందిరినీ మోసం చేసిన ప్రభుత్వమని వ్యాఖ్యానించారు..కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి తరహాలో ప్రభుత్వాన్ని అప్పగిస్తే ఏమీ చేయలేకపోయారని ఒక్క పని కూడా చేయకుండా కేవలం కమీషన్ల కోసమే జిల్లాలోని ముగ్గురు మంత్రులు పనిచేస్తున్నారని విమర్శించారు. గడిచిన రెండేళ్ళ కాంగ్రెస్ పాలనలో ‘ఎగవేతలు, కూల్చివేతలు. పేల్చివేతలు’ మినహా పీకిందేమీ లేదన్నారు. కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు ఇచ్చారా? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చారా? మహిళలకు రూ.2500 ఇచ్చారా?తులం బంగారం ఇచ్చారా? అని ప్రశ్నించారు. ‘మంత్రి పొంగులేటి దీపావళికి బాంబులు పేలుతాయని అన్నారు..ఇప్పటికి రెండు దీపావళిలు పోయాయి.. కానీ బాంబులు మాత్రం పేలలేదు’ అని ఎద్దేవా చేశారు. బాంబుల రెడ్డి ఇంటి మీద ఇడి రైడ్స్ అయితే మోదీ, అదానీ కాళ్ళు పట్టుకొని కేసు కాకుండా బిజెపికి మోకరిల్లారని ఆరోపించారు. మరో మంత్రి తుమ్మల ‘నేను వస్తున్నా’ అని కార్పొరేటర్ల ఇళ్ళ చుట్టూ తిరిగి ముగ్గురిని పట్టుకొని రేవంత్‌రెడ్డి ఇంటికి పోయారని విమర్శించారు.
బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో యూరియా కష్టాలు లేవని. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే క్యూ లైన్‌లలో చెప్పులు కనిపిస్తున్నాయని షాపుల్లో లేని యూరియా యాప్‌లలో ఎలా వస్తుంది? అని ప్రశ్నించారు. యూరియా కోసం రైతులు క్యూకడుతున్నారని యాప్ తీసుకొచ్చారని, అది కూడా ఫెయిల్ కావడంతో ఇప్పుడు యూరియా కార్డులంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు . రెండేళ్ళలోకాలంలో రైతు బంధును కేవలం ఒక్కసారి మాత్రమే వేశారని ఈ సంక్రాంతికి వేస్తారో లేదో తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకు వెయ్యి కోట్లు ఢిల్లీకి కప్పం టకీటకీమని పడుతున్నాయని లేకుంటే సిఎం పోస్టు ఊస్టింగ్ అవుతుందని వ్యాఖ్యానించారు.
గ్యారెంటీ కార్డులను ఎక్కడ పెట్టుకోవాలి?
ఎన్నికల ముందు ఈస్టమన్ కలర్‌లో రాష్ట్ర ప్రజలకు అద్బుతంగా రంగుల ప్రపంచాన్ని చూపించారని, ఆరు గ్యారెంటీలు, 420హామీలు ఇచ్చి గడిచిన రెండేళ్ళలో ఏంచేశారని నిలదీశారు. ఆరు గ్యారెంటీల కార్డును భద్రంగా దాచి పెట్టుకోవాలని ఎన్నికల సమయంలో ఆనాడు సి ఎల్ పి నేతగా మల్లు భట్టి ప్రజలను కోరారని, ఇప్పుడు రెండేళ్లయినా ఆరు గ్యారెం లు అమలు కాలేదని, మరి ఆ కార్డులను ఎక్కడ భద్రపర్చుకోవాలో డిప్యూటీ సిఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి నదీ జలాలపై కనీస అవగాహన లేదని, కనీసం వ్యవసాయం అంటే కూడా తెలియదని ఎద్దేవా చేశారు. నదులు, నీళ్ల గురించి తెలియని సిఎంను చూస్తుంటే జాలి కలుగుతోందని అన్నారు. కెసిఆర్ అప్పులు చేసిన మాట వాస్తవమేనని కెటిఆర్ అంగీకరిస్తూ చేసిన అప్పులన్నింటినీ రాష్ట్ర ప్రజల, రైతుల, విద్యార్థుల్ద భవిష్యత్తు కోసం పెట్టిన పెట్టుబడులని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైందని, ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా బిఆర్‌ఎస్‌దే విజయమన్నారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ వాళ్ళకు అసలైన సినిమా కన్పించిందని, ఈ ఎన్నికలో కేవలం ట్రైలర్ మాత్రం చూపించామని,
సెమీఫైనల్ గా మున్సిపల్,జె డ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో సత్తా చాటి ఫైనల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లను గెల్చుకుని మళ్ళీ తాము అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపి నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీమంత్రి వనమా వెంకటేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, డాక్టర్ చంద్రావతి, తాటి వెంకటేశ్వర్లు, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు, డిసిసిబి మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు దిండిగల రాజేందర్, ఖమర్, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమర్, పార్టీ రాష్ట్ర నాయకులు ఎనుగుల రాకేశ్ రెడ్డి, జిల్లా నాయకులు ఆర్‌జెసి కృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.