Reading Time: < 1 minute

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో ఆయనతో పాటు, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. దీంతో సిఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిని అధికారులు గురువారం విచారణకు రావాలని పేర్కొంటూ నోటీసులు అందచేశారు. దీంతోపాటు బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఏలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలకు సిట్ నోటీసులు అందచేసింది. ఎంఎల్‌సి నవీన్ రావు తండ్రి కొండల్ రావు, ఎంఎల్‌ఏ మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్‌కు నోటీసులు ఇచ్చిన సిట్ వారిని విచారించింది. ట్యాపింగ్ జరిగిన సమయంలో ఫోన్ సంభాషణలు, వ్యక్తిగత సమాచారం, ఇతర కీలక అంశాలపై వివరాలు సేకరించేందుకు సిట్ విచారణ చేపడుతోంది. కాగా, సిఎం కుటుంబ సభ్యులకు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అనుమతులు లేకుండా వేలాది ఫోన్లను ట్యాప్ చేశారన్న ఆరోపణలతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, వ్యాపార వర్గాలకు చెందిన ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు మాజీ అధికారులు, రాజకీయ నేతలను సిట్ విచారించింది.