
పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం వేళ ఉచితంగా స్నాక్స్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4.23 కోట్ల నిధులు మంజూరు చేసింది. వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఈవెనింగ్ స్నాక్స్ అందించాలని డీఈవోలను ఆదేశించింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు మొత్తం 19 రోజుల పాటు విద్యార్థులకు స్నాక్స్ అందించనున్నారు. కాగా మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు తెలంగాణలో ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:50 వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణలోని ప్రభుత్వ, మోడల్ పాఠశాలల్లో పదో తరగతి చదువుతూ ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ప్రభుత్వానికి ప్రతిపాదనలతో కూడిన దస్త్రాన్ని పంపారు.
సాధారణంగా గత కొన్ని సంవత్సరాలుగా పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచే లక్ష్యంతో, సంక్రాంతి సెలవుల తర్వాత లేదా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పరీక్షలు మొదలయ్యే వరకు దాదాపు 35 నుంచి -40 రోజుల పాటు మాత్రమే విద్యార్థులకు ఈ స్నాక్స్ అందించేవారు. అయితే ఈ సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణతను మరింత మెరుగుపరచడానికి దసరా సెలవుల తర్వాత నుంచే ప్రత్యేక తరగతులను ప్రారంభించారు. ప్రత్యేక తరగతులు సాయంత్రం వరకు కొనసాగుతుండటంతో ముఖ్యంగా ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు తమ ఇళ్లకు చేరుకునేసరికి దాదాపు సాయంత్రం 7 గంటలు దాటుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్లే వరకు మధ్యలో ఏమీ తినకపోవడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన విద్యాశాఖ అధికారులు నవంబరు నుంచే సాయంత్రం స్నాక్స్ అందిస్తే విద్యార్థులు ప్రత్యేక తరగతులకు మరింత ఉత్సాహంగా హాజరవుతారని, ఆరోగ్యంగా ఉంటారని భావించి ఈ కీలక ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ పథకం అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4,600 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు,
194 మోడల్ స్కూళ్లలో చదువుతున్న సుమారు 1.90 లక్షల మంది పదో తరగతి విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అంచనా. స్నాక్స్ కోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 ఖర్చు చేయాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. విద్యార్థులకు పోషక విలువలు ఉన్న చిరుతిళ్లను అందించనున్నారు. వీటిలో ఉడకబెట్టిన పెసలు, బొబ్బర్లు లేదా శనగలు, పల్లీలు-, బెల్లం వంటి పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు, చిరుధాన్యాలతో చేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఉల్లిపాయల పకోడి వంటివి రోజుకు ఒక్కో రకం చొప్పున విద్యార్థులకు అందించేందుకు విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.