Reading Time: < 1 minute

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, టారిఫ్‌ల బెదిరింపుల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ట్రంప్‌కు మోడీ దాసోహమైనట్టు కనిపిస్తోందన్న ఉద్దేశంతో పాత వీడియోను పోస్టు చేశారు. అందులో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఏ విధంగా 1971లో అమెరికా ఒత్తిళ్లకు ఏమాత్రం లొంగిపోకుండా నిలబడగలిగారో తాను చేసిన ప్రసంగాన్ని ఉదహరించారు. మంగళవారం ట్రంప్ ప్రధాని మోడీ తనవల్ల సంతోషంగా ఉండకపోవచ్చని, ఎందుకంటే రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నందున టారిఫ్‌లు అధికంగా విధించడమేనని పేర్కొన్నారు.

అంతేకాకుండా“ ప్రధాని మోడీ నన్ను చూడడానికి వచ్చారు. “సర్! మిమ్మల్ని నేను చూడవచ్చునా” అంటే ఎస్ అన్నాను అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాహుల్ వీడియో విడుదల చేశారు. భారత్‌పాక్ సైనిక సంఘర్షణ సమయంలో ట్రంప్ నుంచి పిలుపు రాగానే మోడీ దాసోహం అయ్యారని తన ఎక్స్ ఖాతాలో రాహుల్ వ్యాఖ్యానించారు. 1971 నాటి యుద్ధంలో అమెరికా ఏడవ నౌకాదళాన్ని పంపించినా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఏమాత్రం చలించలేదని రాహుల్ ఉదహరించారు. ఇది అప్పటి ప్రధానికి, ఇప్పటి ప్రధానికి గల వ్యత్యాసం అని రాహుల్ విమర్శించారు. ట్రంప్ వ్యాఖ్యలతో ఉన్న వీడియోను షేర్ చేస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇన్‌ఛార్జి కమ్యూనికేషన్స్ జైరామ్ రమేష్ కూడా ప్రధాని మోడీ వైఖరిని ఆక్షేపించారు. అమెరికా నుంచి రావలసిన అపాచీ హెలికాప్టర్ల కోసం భారత్ మరో ఐదేళ్లు ఆగాలని ట్రంప్ వ్యాఖ్యానించడాన్ని కూడా కాంగ్రెస్ విమర్శించింది.